– త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం
– చివరి లబ్ధిదారుడి వరకు గొర్రెల పంపిణీ జరుగుతుంది
– గొర్రెల మార్కెట్ యార్డ్ నిర్మాణానికి రూ.25 లక్షల మంజూరు
– 4.5 ఎకరాల భూమిలో గొర్రెలు మరియు మేకల మార్కెట్ యార్డ్ ఏర్పాటు
– గొర్రెలకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ
– అక్టోబర్ 15 నుండి ప్రతి గొర్రెకు బీమా సదుపాయం
– గ్రామాల్లో పశువుల ఆసుపత్రి సబ్ సెంటర్
– పాల కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
– రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పెద్దపల్లి సెప్టెంబర్ 20: గ్రామాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి పెద్దపల్లి చేరుకున్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ మత్స్యపశు సంవర్ధక శాఖ మంత్రికి పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఇతర ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం అంతర్గాం మండలంలో కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న గొర్రెలు మరియు మేకల మార్కెట్ యార్డ్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగిస్తూ సంపద సృష్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యాదవ, గొల్ల కురుమలకు 20 గొర్రె పిల్లలు,1 పోటెలుతో కూడిన గొర్రెల యూనిట్ పంపిణీ కి సీఎం నిర్ణయించి, మొదటి విడతలో 50 శాతానికి పైగా పంపిణీ చేశారని మంత్రి అన్నారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, అనేక ఇతర కారణాల వల్ల రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆలస్యమవుతుందని, ఇప్పటికే కొంతమంది గొల్ల కురుమలు డీడీ లు చెల్లించారని తెలిపారు. సమస్యలను అధిగమిస్తూ అతి త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని, చివరి లబ్ధిదారుడు వరకు తప్పనిసరిగా గొర్రెల పంపిణీ జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.

గొల్ల కురుమలు అధికంగా ఉన్న ప్రాంతంలో గొర్రెలు మరియు మేకల మార్కెట్ యార్డుకు 4.5 ఎకరాల స్థలం కేటాయించాలని తన దృష్టికి శాసనసభ్యులు కోరుకంటి చందర్ తీసుకు వచ్చిన తర్వాత, సీఎం కేసీఆర్తో చర్చించి రూ.25 లక్షలను వెంటనే మంజూరు చేశారని మంత్రి తెలిపారు. రూ.25 లక్షల చెక్కును మంత్రి అందించారు. విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలో డైరీలలో వారికి 213000 బర్రెల పంపిణీకి సంకల్పించి కొంతమేర పంపిణీ చేశామని, మిగిలిన వారికి సైతం త్వరలో అందిస్తామని తెలిపారు. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ డైరీలకు పాలు పోసే రైతులకు ప్రతి లీటర్ కు రూ.4/- ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.
గొర్రెల పంపిణీతో పాటు గొల్ల కుర్మలకు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, 24 గంటల ఉచిత విద్యుత్ సైతం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు గొర్రెలకు వినియోగించే మందులు సమాచారం అందిస్తే, వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీ గొర్రెల తోపాటు ఇతర గోర్రెలకు సైతం జీవిత బీమా కల్పించడానికి నిర్ణయించామని, 20% ప్రజలు చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం భరిస్తుందని, అక్టోబర్ 15 నుండి దీనిని అమలు చేస్తామని మంత్రి తెలిపారు
పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేతకాని, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి కె నరసింహమూర్తి, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక రావు, జడ్పీటీసీలు కందుల సంధ్యారాణి ,నారాయణ, ఎంపీపీలు అనసూయ, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు తిరుపతి ,కుర్మా సంఘం అధ్యక్షులు మల్లేశం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రాజన్న, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు స్థానిక సర్పంచ్ లు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు , గొల్ల కుర్మ సంఘ ప్రతినిధులు, తహసిల్దార్ లు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు