– యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 17ః కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉన్న గోదావరికి విముక్తి కలిగించాలని యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పీక అరుణ్ కుమార్ పాలకులను, అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. గోదావరిఖని ప్రాంతంలోని గోదావరి నదిలో అనేక ప్రమాదకరమైన రసాయనాలు, వ్యర్ధాలు, డ్రైనేజీ నీరు కలిసి పవిత్ర గోదావరి కలుషితం అవుతుందని పేర్కొన్నారు. గోదావరి నీరు కలుషితం కావడంతో పాటు కొత్తగా నురుగు నీరు ప్రత్యక్షం అవుతున్న కూడా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారని తెలిపారు. వెంటనే గోదావరి జలాలను శుద్ధి చేయాలని కోరారు. గోదావరిలో కలుషిత నీరు కలవడంతో జలచరాలకు ప్రాణాంతకంగా మారుతుందని పేర్కొన్నారు.
ఫ్యాక్టరీలు పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత నీరు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాలుష్య కోరల్లో ఉన్న గోదావరిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందన్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం శ్రద్ధ వహించి వెంటనే కలుషిత జలాలు గోదావరిలో కలవకుండా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసే వద్ద చెత్తా చెదారం వుండటం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంది. అక్కడ చెత్త చెదారం లేకుండా చేసి కనీస మౌళిక సదుపాయాలను కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు.