– పెద్దపల్లి డిసిపి రవీందర్ పిలుపు
(ప్రజా లక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని,అక్టోబర్ 29: సమాజంలో గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్ధాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పెద్దపల్లి డిసిపి రవీందర్ పేర్కొన్నారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ‘గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సు’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ లు మాట్లాడుతూ నిషేధిత గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండా లన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి మత్తులో నేరాలు చేసి, సమాజంలో నేరస్తులుగా మారవద్దని సూచించారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, వినియో గించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్షణ కాలం సంతోషం కోసం, విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల దానిని సేవించిన వారి మానసిక వ్యవస్థ దెబ్బతిని, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుందన్నారు.
అమాయక యువత తెలిసీ తెలియక దీని బారిన పడుతోందన్నారు. విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ, డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని, అనేక కారణాలతో కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారన్నారు. పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి పట్టణం, కాలనీ, గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, తల్లి దండ్రులు, విద్యార్థులు, యువతపై దృష్టిసారించాలన్నారు. గంజాయి మత్తులో ఉన్నవారు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారో తెలియని పరిస్థితిలో ఉంటారన్నారు. అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
కార్పొరేటర్లూ సహకరించండి
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 33 డివిజన్ల కార్పొరేటర్లూ, ప్రజలూ తమ డివిజన్లలో గంజాయి అమ్ము తున్న ట్లుగాని కొన్నట్లుగాని, సేవిస్తున్నట్లుగాని తెలిస్తే, పోలీస్ లకు సమాచారం అందించాలన్నారు. ఎవరి ఏరియాలో వారు పూర్తిగా గంజాయి నిర్ములించామని నిర్దారణ చేసుకున్నాక, పోలీస్ వారికి కార్పొరేటర్లు ఒక సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
పీడీ యాక్టు నమోదు చేస్తాం
సిపి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి రవాణా మూలాలను కనుక్కొని, నిర్మూలిస్తామని, యువత కదలికలపై కన్నేసి ఉంచాలన్నారు. చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు చేస్తున్న వారి సమాచారం తెలిస్తే, డయల్ 100 కి గాని స్థానిక పోలీస్ అధికారుల నంబరుకుగానీ సమాచారం ఇవ్వాలని కోరారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, నగదు పురస్కారం అంద జేస్తామన్నారు. అనంతరం గంజాయి నిర్మూలన గోడపత్రికను డీసీపీ, ఏసీపీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ రమేష్ బాబు, టూటౌన్ సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు ఉమాసాగర్, సతీష్, కార్పొరేటర్లు, కారు, ఆటో ఓనర్లు, డ్రైవర్లు, యువకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.