– ప్రతీ రోజు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా
– వచ్చే ఏడాది నైనీ, వీకే ఓసీ గనుల నుంచి 8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
– డైరెక్టర్లు, ఏరియాల జీఎంల సమీక్షలో ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి ` హైదరాబాద్)
2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల (75 మిలియన్ టన్నుల) ఉత్పత్తి లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలని సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్‌లో గురువారం సంస్థ డైరెక్టర్లు, అడ్వజర్లు, అన్ని ఏరియాల జిఎంలతో జరిగిన ఉత్పత్తి సమీక్షా సమావేశం ఆయన దిశా నిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత కీలకమైన చివరి మూడు నెలల కాలంలో గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరుగుతుండటం సంతోషకరమని తెలిపారు. ఇకపై రోజుకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగే విధంగా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఉత్పత్తితో పాటు ఓవర్ బర్డెన్ వెలికితీత కూడా 17 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఇదే స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణాను వర్షాకాలం ప్రారంభం వరకు కొనసాగించాలని, తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24) నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమన్నారు. వచ్చే ఏడాది ఒడిశా రాష్ట్రంలోని నైనీ, కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్ కాస్టు నుంచి కనీసం 80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, తద్వారా 12 శాతం వృద్ధితో 750 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు.
ఏరియాల వారీగా ఆయన సమీక్షిస్తూ కొత్త గూడెం ఏరియా ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండటంపై అభినందనలు తెలిపారు. అలాగే మణుగూరు, ఇల్లందు మంచి వృద్ధిని కనబరుస్తున్నాయన్నారు. రామగుండం- 1,2,3 ఏరియాలలోని అన్ని గనులు గతంకన్నా మెరుగుదలతో ముందుకుపోవడం సంతోషకరమన్నారు. శ్రీరాంపూర్, మందమర్రి కూడా లక్ష్యాలకు చేరువగా కృషి చేస్తున్నాయన్నారు. భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాలు మరింత బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కొత్త ప్రాజెక్టులు, విస్తరణ గనులకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు చక్కని సహకారం అందిస్తున్నారని, సంస్థ డ్కెరెక్టర్లు నిరంతరాయంగా జిల్లా అధికారులతో సంప్రదిస్తూ అనేక సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందని, ఏరియాల జీఎంలు కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ శాఖల వారిని కలుస్తూ ఇంకా మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా సగటున రోజుకు 2.21 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నామని, ఇకపై అన్ని ఏరియాలలో గనులు కలిసి రోజుకు అదనంగా మరో 9 వేల టన్నుల ఉత్పత్తిని సమకూర్చ గలిగితే రోజు వారీ లక్ష్యాన్ని, తద్వారా వార్షిక లక్ష్యాన్ని చేరుకోగలమని, దీనికోసం ఏరియాల జీఎంలు, సంస్థ డైరెక్టర్ ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు రవాణాకు సంబంధించిన కాంట్రాక్టర్లతో ఏరియాల జీఎంలు నిత్యం సమావేశం అవుతూ నిర్దేశిత లక్ష్యాలు సాధించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రానున్న కాలంలో చేపట్టనున్న ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల టెండర్లు, తదితర ప్రక్రియలన్నీ మూడు నెలల ముందుగానే పూర్తి చేయాలని, దీనిపై డైరెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సమావేశానికి ముందు లక్ష్యాల సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సింగరేణి అధికారులు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే సుదీర్ఘ కాలం కంపెనీలో పనిచేసి సంస్థ డ్కెరెక్టర్ (ఆపరేషన్స్,పా)గా విశేష సేవలు అందించి ఇటీవలనే పదవీ విరమణ చేసిన ఎస్.చంద్రశేఖర్ సేవలను శ్లాఘించారు.
ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ (ఫైనాన్స్, పా) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి. సత్యనారాయణరావు, డ్కెరెక్టర్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.వి.కె. శ్రీనివాస్, డైరెక్టర్ (పి అండ్ పి) జి.వెంకటేశ్వరరెడ్డి, అడ్వజర్ (మైనింగ్) డి.ఎన్. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.అల్విన్, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(సీపీపీ) సీహెచ్.నరసింహారావు, జీఎం (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ సింగరేణి భవన్ నుంచి పాల్గొనగా, కార్పోరేట్ ఏరియా జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.