(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 11: జిల్లాలో మంజూరైన 6494 డబుల్ బెడ్ రూం ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, సిపిఓ అధికారులతో అర్బన్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 6494 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఇందులో 784 ఇప్పటికే పూర్తి కాగా 1993 వివిధ దశలలో ఉన్నాయని వీటిని సెప్టెంబర్ -2020 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వీటికి కావలసిన మౌళిక సదుపాయాల కల్పన విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని, వీటికి కావలసిన నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి అయిన గృహములు దసరా వరకు లబ్దిదారులకు అందజేసే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఎస్.ఇ.ఎన్.పి.డి.సి.ఎల్ మాధవరావు, ఈ.ఈ. ఆర్ అండ్ బి సాంభ శివ రావు, ఇ.ఇ. మిషన్ భగీరథ ఉప్పలయ్య, ఈ.ఈ. గ్రిడ్ చల్మారెడ్డి, ఈ.ఈ. పె.హెచ్. చిన్నా రావు, ముఖ్య ప్రణాళికా అధికారి పూర్ణ చంద్రా రావు, తదితరులు పాల్గొన్నారు.