(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 14: ఇటీవల తీగలగుట్టపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగటిపూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
వివరాళ్లోకి వెళితే… కరీంనగర్ వావిలాల పల్లికి చెందిన బొంత వంశీ (20)తో పాటు తన ఇద్దరు మిత్రులు (ఇద్దరు మైనర్లే) చేరదీసి వారితో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పగటిపూట మోటార్ సైకిల్ పై ముగ్గురు మిత్రులు తిరుగుతూ ఊరి చివర ఒంటరిగా, తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి, ఆ ఇంటిని తమ దొంగతనానికి ఎంచుకొని, ఆ చుట్టు పక్కల ఎటువంటి మనుషుల సంచారం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలు మరియు నగదును దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
అదే క్రమంలో గత నెల 26 న తీగలగుట్టపల్లి కోదండ రామాలయం సమీపంలో ఉన్న సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఉదయం పది గంటలకు ఇంటికి తాళం వేసి తన భార్యతో సహా వెళ్ళినాడు. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి ఆ ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బీరువా లోనీ బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఆ ఇంటికి సమీపంలోనే ఉన్న మరొక ఇంట్లో తేదీ 02-09-20 రోజున ఇంటి యజమాని ముజాయిద్ తన వృత్తి రీత్యా ఉదయం సమయం తొమ్మిది గంటలకు బయటకు వెళ్ళినాడు. సుమారు 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న సొత్తును దొంగిలించారని తెలిపారు.
తీగల గుట్టపల్లి నుండి దుర్గామాత ఆలయానికి వెళ్లే దారిలో గ్రామ చివరన గల గృహ సముదాయంలో ఒక ఇంటిలో సహెదా అనే మహిళ నివసిస్తోంది. ఆమె తన వృత్తిరీత్యా బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి, ఇంట్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలు మరి కొంత నగదు దొంగిలించుకెళ్లారని పోలీసులు తెలిపారు.
ఈ విధంగా పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కట్టడి చేయాలనే లక్ష్యంతో ఆరు టీములుగా ఏర్పడి ఒక వైపు గస్తీని తీవ్ర తరం చేసి, మరో వైపు సాంకేతిక సహాయంతో కేసులను చేదించాలని పదిరోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి దొంగల ముఠా కదలికలను సీసీ కెమెరాలలో గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
అదే క్రమంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన నిందితుల ఫోటోలను, వారు ఉపయోగించిన వాహనం వివరాలు సోషల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరగడం వలన గమనించిన పౌరసమాజం నిందితుల ఆనవాళ్ళు కలిగిన వ్యక్తులు తీగల గుట్టపల్లి లోని విద్యారణ్యపురి లో సంచరిస్తున్నారనే సమాచారం అందించడంతో విద్యారణ్యపురి రోడ్ లో అనుమానంగా సంచరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేసిన నేరాలను అంగీకరించడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. నేరాలను చేదించుటలో కీలకపాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమీషనర్ అభినందించారు.