(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 1: జాతీయ నేతల అరెస్టుకు నిరసనగా స్థానిక ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనపై బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిం చేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హాజరై మాట్లాడుతూ హథ్రాస్‌కు శాంతి యుతంగా పాదయాత్రగా వెళుతున్న రాహుల్ గాంధీ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని అన్నారు. యూపీలోని హథ్రాస్‌లో పొలం పనులకు వెళ్లిన దళిత యువతిపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారన్నారు. బాధితురాలు మత్యువుతో పోరాడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో మృతిచెందిందన్నారు.
రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీని వెంటనే సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని రాష్ట్రపతి పాలన విధించాలని మక్కాన్‌సింగ్ డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు యండి ముస్తాఫా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.