– రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 29: నేరంచేస్తే మూడోకన్ను వెంటాడుతుందనే భయం నేరస్థుల్లో గుబులు రేపుతోందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుతో నేరస్థులు నేరాలకు పాల్పడేందుకు జంకుతున్నారని చెప్పారు. కరీంనగర్ కమిషనరేట్ ఏర్పాటు తర్వాత సిసి పుటేజీల ద్వారా చేధించబడిన పలు నేరసంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు
కరీంనగర్ కమిషనరేట్‌లోని మహిళ పోలీసులకు విధినిర్వాహణ కోసం వినియోగించేం దుకుగాను ప్రభుత్వం మంజూరు చేసిన ద్విచక్రవాహనాలను కమిషనరేట్ కేంద్రం పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో మంగళవారం మంత్రి అందజేసారు. కమిషనరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన మహిళ పోలీసులు ఈ ద్విచక్ర వాహనాలను మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఇందులో ప్రభుత్వం 13మంజూరు చేయగా హీరో కంపెనీకి చెందిన భరద్వాజ ఆటోటెక్ డీలర్లు 20 ద్విచక్ర వాహనాలను అందజేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి మాట్లాడుతూ పోలీస్‌శాఖ అమలు చేస్తున్న సంస్కరణలతో విప్లవాత్మకమైన మార్పువచ్చిందన్నారు. రేయింబవళ్ళు శ్రమిస్తున్న పోలీసులు వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ తరహాలో కరీంనగర్‌లో అన్నిరకాల అత్యాధునిక సౌకర్యాల కల్పనకోసం పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. ఆత్మనూత్యతాభావాన్ని విడనాడి కమిషనరేట్‌లోని మహిళా పోలీసులు అన్నివిభాగాల్లోనూ విధులను నిర్వహించడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు.
పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ కమిషనరేట్‌లో మహిళపోలీసులు అమూల్యమైన సేవలందిస్తున్నారన్నారు. అన్నిస్థాయిలకు చెందిన 88మంది మహిళ పోలీసులున్నారని చెప్పారు. ఒక్కోసారి ఎక్కువ దూరం విధినిర్వాహణ నిమిత్తం వెళ్ళాల్సి వచ్చిన సందర్భాలలో సులువుగా వెళ్ళేందుకు ఈ వాహనాలు దోహదపడుతాయని తెలిపారు. వివిధ రకాల విధినిర్వాహణల కోసం ఈ వాహనాలను మహిళ పోలీసులు వినియోగిస్తారని వివరించారు.
మొబైల్ రెస్ట్‌రూం వాహనాన్ని ప్రారంభించిన రాష్ట్రమంత్రి
ప్రభుత్వం కమిషనరేట్‌కు మంజూరు చేసిన మహిళల మొబైల్ రెస్ట్‌రూం వాహనాన్ని రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ వాహనం మహిళలకు ఎంతోసౌకర్యవంతంగా ఉంది. విధినిర్వాహణ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా మహిళాపోలీసులు ఇబ్బందులకు గురవ్వకుండా అన్నిరకాల వసతులను ఇందులో పొందు పరిచారు. ఇందులోని సౌకర్యాలను మంత్రి పోలీస్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు.
ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని మహిళలకు కేటాయించిన వాహనాలను జిల్లా కలెక్టర్ కె శశాంక,రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జెండాఊపి ప్రారంభించారు. అనంతరం మహిళ పోలీసులు ర్యాలీగా వెళ్ళి వచ్చారు.
జిమ్నాజియం సందర్శించిన మంత్రి
కమిషనరేట్ కేంద్రంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసి ఇటీవల ప్రారంభించబడిన జిమ్నాజియంను రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారంనాడు సందర్శించారు. దేహదారుఢ్యాన్ని కాపాడుకోవడం, రోగ నిరోధకశక్తిని పెంపొందించడం కోసం ఈ జిమ్నాజియంను ఏర్పాటు చేశారు. పూర్తి ఏయిర్ కండీషన్ సౌకర్యంతో ఏర్పాటైన ఈ జిమ్నాజియంలోని అత్యాధునిక పరికరాల పనితీరును పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి మంత్రి గంగుల కమలాకర్‌కు వివరించారు. జిమ్నా జియంలోని అత్యాధునిక పరికరాలను చూసి మంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
దిలాంజ్ సందర్శించిన మంత్రి
కమిషనరేట్ కేంద్రంలో నిజాంకాలంలో నిర్మించిన పురాతనమైన గోల్‌బంగ్లాను ఆధునీకరించి దిలాంజ్ పేరిట అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన భవనాన్ని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి సందర్శించారు. ఈ లాంజ్ ఆవరణ పచ్చికబయళ్ళు, వాటర్ ఫౌంటేన్లతో అహ్లాద వాతావరణం కల్పించే రీతిలో తీర్చిదిద్దారు. కమిషనరేట్‌కు వచ్చిన అతిధులు సమావేశాలు నిర్వహించుకోవడం, కాలక్షేపం కోసం పఠనం చేసేందుకు వీలుగా వివిధ రకాల దిన, వార, పక్ష, మాస పత్రికలను ఇందులో అందుబాటులో ఉంచారు. ఆకర్షణీ యంగా తీర్చిదిద్దడం కోసం తీసుకున్న చర్యలను మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
గజ ఈతగాళ్ళను సన్మానించిన మంత్రి
గత ఆదివారం వీణవంక మండలం చల్లూరు మానేరునదిలో నీటిప్రవాహంలో చిక్కు కున్న ముగ్గురు మత్స్యకార్మికులను ప్రాణాలతో రక్షించిన రెస్క్యూటీం సభ్యులు, గజ ఈత గాళ్ళను రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సన్మాంచి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. సన్మానం పొంది జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందుకున్న వారిలో రెస్క్యూటీం ఆనంద్, టీంఇంఛార్జి జంకుట ఆనందం, గజ ఈతగాళ్ళు తిప్పర్తివేణి మల్లేశం, గీకురు సంపత్, గీకురు శేఖర్, గీకురు రాజేశం, గందె శ్రీనివాస్, కొత్తూరి పరుశరాములు, ఎండ్ర సంపత్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్‌పి ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, నగర మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటి ఛైర్మెన్ చల్ల స్వరూపరాణి, సుడా ఛైర్మెన్ జివి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ కె శశాంక, అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (ఎల్‌అండ్‌ఓ), జి చంద్రమోహన్ (పరిపాలన), ట్రైనీ ఐఏఎస్ అధికారి అంకిత్, ఐపిఎస్ అధికారిణి రష్మీ పెరుమాళ్, ఏసిపిలు విజయసారధి, అశోక్, ఎస్‌బిఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానీమియా, శేఖర్, నగరంలోని పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.