– జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర, అక్టోబర్ 5: అక్టోబరు 15 వ తేది వరకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బతుకమ్మ చీరల పంపిణీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలకు కుల, మతాలకు అతీతంగా అందరికి బతుకమ్మ చీరలు అందిస్తుంది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి టీంలు ఏర్పాటు చేయాలని, ఆ టింలు పంచాయతి సెక్రటరీ, మహిళా సంఘాలు, రేషన్ షాపు డీలర్లు సభ్యులతో చీరలు పంపిణీ చేయించాలని తెలిపారు. పట్టణాలు, మున్సిపాలిటీ పరిధిలో సంబంధిత వార్డు, బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘాల సభ్యులు, రేషన్ షాపు డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అక్టోబర్ 9, 10, 11 వ తేదిలలో కోవిడ్ కారణంగా ఇండ్లకు వెళ్లి పంపిణీ చేయాలని అన్నారు. 11 వ తేది తర్వాత బతుకమ్మ చీరలు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని అన్నారు. 18 సంవత్సరాలు పై బడిన అర్హత గల వారందరికి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆధికారులకు కలెక్టర్ ఆదేశా లిచ్చారు.
జిల్లాలో మొత్తం 3 లక్షల 10 వేల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ కారణంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసే డీలర్లు నిబంధనలు పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ వాడుతూ పంపిణీ చేయాలని సూచించారు. బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో లబ్దిదారులు అహార భద్రత కార్డులు, ఆధార్ కార్డు లేదా ఇతర ఏదేని గుర్తింపు కార్డులను తప్పకుండా వెంట తీసుకుని రావాలని కోరారు. చీరలు ఇచ్చి సంతకాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమం ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతి అధికారి వీర బుచ్చయ్య, చేనేత జౌళీశాఖ ఏడి సంపత్, ఆర్డీఓలు ఆనంద్ కుమార్, పి.బెన్.షలోమ్, తదితరులు పాల్గొన్నారు.