– పోలీసుల అదుపులో 15 మంది యువకులు
– రూ.1.40లక్షల నగదు, 16 మోబైల్స్ స్వాధీనం..
– వివరాలు వెల్లడించిన డీసీపీ (అడ్మిన్) అశోక్‌కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 20: రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా నస్పూర్ ఏరియాలోని మదర్ క్లినిక్, ప్లడ్ కాలనీలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మంది యువకుల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీసీపీ (అడ్మిన్) ఎన్.అశోక్ కుమార్ వెల్లడించారు.
సీసీఎస్ ఏసీపీ గణేష్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ రమణ బాబు, డి.మహేందర్, హెడ్ కానిస్టేబుల్ రామారావు కానిస్టేబుళ్లు సునిల్‌కుమార్, రాజయ్య, సిబ్బందితో కలిసి చెన్నై వర్సెస్ రాజస్తాన్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్‌కు పాల్పడుతూ లావాదేవీలు నిర్వహిస్తున్న జాబ్రి ఇక్బాల్ (32), జాబ్రి హంధి (31), జాబ్రి అకిల్ (31), కొమ్మెర విజయ్ (32) ఎండి ఫహీమ్ (24), సుంకరి సాగర్ (25), అనుమాస్ సరత్‌కుమార్ (26), నేదూరి శ్రీనివాస్ (36), అగ్గు కిరణ్ (30), అగ్గు స్వామి (28), చిట్యాల ప్రశాంత్ (25), సూరిమిల్ల కార్తీక్ (30), చింతరాజు శరత్ అలియాస్ చిన్ను (24), మాచెర్ల సాయి (23), కోట ఉదయ్ రాజ్ (26) మందిని అదుపులోనికి తీసుకోవటం జరిగిందని అశోక్‌కుమార్ తెలిపారు. ఒక వ్యక్తి పరారీలో వున్నాడని పేర్కొన్నారు. వారి వద్దనుండి16 మోబైల్స్. రూ.1,40,800 నగదును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే వారిని పక్కా ప్రణాళికతో పట్టుకుంటామని తెలిపారు. బెట్టింగ్ రాయుల్లు, జూదగాళ్లపై వరుస దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. బెట్టింగ్ వంటి వ్యసనాల వలన యువత ఇతర పనిచేసుకునేవాళ్లు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. ఆర్ధికంగా నష్టపోవడమే కాక మంచి భవిష్యత్తుని కోల్పోతున్నారని, ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.
నిషేదిత ఆటలు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు. బెట్టింగ్ నిర్వాహకులని విడిచిపెట్టేది లేదని చట్టపరంగా కటిన చర్యలు తీసుకుంటామని, పదే పదే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పిడి యాక్టులు అమలు పరుస్తామని ఈ సందర్భంగా డీసీపీ అశోక్ కుమార్ హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ గణేష్, ఇన్‌స్పెక్టర్ రమణ బాబు, మంచిర్యాల, నస్పూర్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఏ.వెంకటేశ్వర్, జి.వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి. స్వామి, ఎస్‌బి ఇన్స్పెక్టర్ టి.నారాయణ, ప్రమోద్ రెడ్డి, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, మహేందర్, సి.అశోక్, సయ్యద్ ఇస్సాక్ అలీ, బి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.