– సీపీఐ నేతల డిమాండ్
– హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్ ద్వారా లేఖలు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 15: లేఅవుట్ రెగులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ను తక్షణమే రద్గు చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేసారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రదాన న్యాయమూర్తికి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గురువారం సీపీఐ శ్రేణులు పోస్ట్ ద్వారా లేఖలు పంపడం జరగింది.
అనంతరం నగర కార్యదర్శి కె.కనక రాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, జిల్లా మాజీ సహాయ కార్యదర్శి గౌతం గోవర్ధన్‌లు మాట్లాడుతూ ఎల్‌అర్‌ఎస్‌ను రద్దు చేయాలని, దీనివల్ల సామాన్య ప్రజానీకం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ క్రమబద్దీకరణ చట్టం ముసుగులో పేద ప్రజలపై ఎల్‌అర్‌ఎస్ విధానం ద్వారా పెను భారం మోపుతుందన్నారు. కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడాని మాత్రమే చేస్తున్న ప్రయత్నంలా కనపడుతుందన్నారు.
గత ఆరు నెలల కాలం నుండి కరోనా కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక లావాదేవీల్లో ఎన్నో మార్పులు రావడం జరిగిందన్నారు. అసలు జీవించడమే భారంగా మారిన ఈ పరిస్థితిలో పేద ప్రజల నడ్డి విరిచేలా ఎల్‌అర్‌ఎస్ రూపంలో జివోలు తెచ్చి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. సాధారణ జనం పైసా పైసా కూడబెట్టి కష్టపడి భవిష్యత్లో పిల్లలకు ఉపయోగపడే విధంగా స్థలాలు కొనుక్కొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని రకాల ప్రభుత్వ చాలన్లు చెల్లించి, ప్రభుత్వ అధికారుల చేత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా చేసుకున్న వాటిని క్రమ బద్దీకరణ పేరుతో మళ్ళీ ఎల్‌అర్‌ఎస్ రూపంలో డబ్బులు చెల్లించాలని కొత్త నిబంధనలు పెట్టిందన్నారు. ఇదే సరియైన పద్ధతి అంటూ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో సామాన్యులపై పెనుభారం పడేలా చేయడమే కాక, డెడ్ లైన్‌ల పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందని విమర్శించారు.
గతంలో ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన విధానాన్ని ప్రజలు వివిధ రకాలుగా ప్రభుత్వానికి చాలన్ల రూపంగా చెల్లించిన రూపాయలు అన్ని తుంగలో తొక్కి, గత విధానం అంతా తప్పు అని, ఒక నిరంకుశ పూరిత విధానంతో ఎల్‌అర్‌ఎస్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. తక్షణమే ఎల్‌అర్‌ఎస్ పై ప్రభుత్వ విధానాన్ని పున:సమీక్షించి వెంటనే ఎల్‌అర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసారు. పేద, సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వం అండగా ఉండాలే కానీ దోచుకునే విధంగా ఉండ కూడదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు ఎల్‌అర్‌ఎస్ విధానాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం రద్గుచేయక పోవడం దారుణం అన్నారు. వెంటనే ఎల్‌అర్‌ఎస్‌ను రద్దు చేయాలని సీపీఐ పక్షాన హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖల ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రజాసంఘాల నాయకులు మడ్డి ఎల్లయ్య, తాళ్లపెళ్లి మల్లయ్య, కందుకూరి రాజరాత్నం, జిగురు రవీందర్, టి.రమేష్ కుమార్, చంద్రయ్య, బుర్ర భాస్కర్, పడాల కనుకరాజ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు..