– భార్యపై అనుమానంతో సైకోగా మారిన నిందుతుడు
– చేయని తప్పుకు డ్రైవర్ నర్సయ బలి
– ముగ్గురి నిందితుల అరెస్టు
– వివరాలు వెల్లడించిన సీపీ కమలాసన్ రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 14: తన పని తాను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ట్రాక్టర్ డ్రైవర్ చెయ్యని తప్పుకు బలయ్యాడు. ఫలితంగా అతని కుటుంబ రోడ్డుపాలయ్యింది. భార్యపైఉన్న అక్రమసంబంధం అనుమానంతో ఇందుకు కారణమైన వ్యక్తిపై కక్షతీర్చు కోవాలనే ప్రయత్నం నెరవేరకపోవడంతో ఆవ్యక్తికి సంబంధించిన కుటుంబసభ్యుల్లో ఏవరినో ఒకరిని హత్యచేయాలని నిర్ణయించి తన కాపురంలో చిచ్చురేగడానికి ఎటువంటి సంబంధం లేని అమాయకుడైన ఇరుకుల నర్సయ్యను భర్త మరో ఇద్దరి సహాయంతో అతి కిరాతకంగా హత్యచేశాడు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన సమావే శంలో సీపీ కమలాసన్ రెడ్డి సంఘటనకు సంబంధించిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు చూపిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కరీంనగర్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్న నర్సయ్య ఈ నెల 10న ఆటోనగర్‌లోని ఇసుక డంపుల కేంద్రం వద్ద హత్యకు గురయ్యాడు. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన తీట్ల శ్రీనివాస్(45)కు కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన మహిళతో వివాహం జరిగింది. కొన్నిరోజులపాటు గోదావరఖని ప్రాంతంలోనే ఉన్న వారు కుటుంబ కలహాలతో కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. తనభార్య వివిధ ఉద్యోగాల శిక్షణ కోసం కరీంనగర్‌లోని ఒక శిక్షణ కేంద్రంలో చేరింది. అక్కడ పరిచ యం అయిన వ్యక్తితో సన్నిహితంగా ఉండేంది.
వీరిద్దరి మధ్య అక్రమసంబంధం ఉన్నట్లు అనుమానం కలిగిన భర్త శ్రీనివాస్ తరచూ అనుమానించేవాడు. వీరిద్దరి సెల్‌ఫోన్ సంభాషణలు రికార్డు చేయబడ్డాయి. వాటిని వింటూ మానసిక రోగిగా మారి తన భార్యతో సన్నిహితంగా మెదులుతున్న వ్యక్తిని హత మార్చా లని ప్రయత్నించినా సరైన ఆధారాలు, ఆచూకీ లభించకపోవడంతో సదరు వ్యక్తికి స్వయాన బావ అయిన ఇరుకుల నర్సయ్యను చంపాలని పథకం పన్నాడు. ఇందుకోసం వరుసకు కొడుకు అయిన పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన కారెంగుల శివ (27), సోదరుడైన కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన సంబోజి సాయికిరణ్ (22)ల తో పథకం రూపొం దించాడు.
హత్యకు వారం ముందు నుంచి రెక్కీ నిర్వహించి నర్సయ్య దినచర్యలు తెలుసుకున్నారు. కాజీపూర్, లింగాపూర్ ఇసుక డంపులు నిల్వ చేసిన ఆటోనగర్‌తో పాటు నర్సయ్య అద్దెకుంటున్న హనుమాన్‌నగర్‌లోని ఇంటిని పలుమార్లు పరిశీలించారు. నర్సయ్య ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నారు. ఈనెల 10న హత్య చేయాలని నిర్ణయిం చుకొని ముందు రోజు రాత్రి నుంచే మద్యం సేవించి డ్రైవర్ ఇంటి వద్దనే వేచి ఉండి నర్సయ్య ఇంటినుండి ట్రాక్టర్ తీసుకొని ఆటోనగర్‌కు బయలు దేరినప్పుడు రెండు ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వెంబడిస్తూ వచ్చారు. కొద్ది దూరంలోనే వాహనాలను నిలిపి, తెల్లవారుజామున 4.45 గంటలకు నర్సయ్య ఇసుక ఎత్తుతుండగా గొడ్డలి, కత్తి, ఉలితో అత్యంతదారుణంగా హత్యచేశారు
హత్యచేసిన అనంతరం నిందితులు భూపాలపల్లికి పారిపోయారు. మార్గమధ్యలో ఎవరికీ అనుమానంరాకుండా బట్టలను మార్చుకున్నారు. భూపాలపల్లి నుండి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ ఎలాంటి షల్టర్ లభించకపోవడంతో కరీంనగర్‌కు చేరుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ సమాచారం అందడంతో వీరిని అరెస్టు చేశారు. వారివద్ద నుండి మారణాయుధాలు ఒక గొడ్డలి, ఒక కత్తి, ఒక ఉలితోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హత్య జరిగిన తరువాత నర్సయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కరీంనగర్ టౌన్ ఏసిపి ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్, సిటి స్పెషల్‌బ్రాంచి, టాస్క్‌ఫోర్స్, ఐటిసెల్, సిసిఎస్, క్రైంబృందాలు, ఫోరెన్సిక్‌సైన్స్ ల్యాబోరేటరీ విభాగాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నాలుగు రోజుల్లో ఈ బృందాలు రేయింబవళ్ళు తీవ్రంగా శ్రమించి హత్య మిస్టరీని ఛేదించాయి.
సిసి కెమెరాలే కీలకం…
నర్సయ్యను ఇసుక లోడ్‌చేసే వద్దకు మారణాయుధాలతో వెళ్ళి హత్యగావించిన దృశ్యాలు సిసికెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వీడియోను పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో సీసీ పుటేజీ ఆధునీకరించి స్పష్టంగా కనిపెట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీస్‌శాఖ వివిధ వాట్సాప్‌గ్రూపుల్లో కూడా ప్రచారం చేసిన విషయం విదితమే. సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించడం, టెక్నాలజీ సహకారంతో వారు సంచరిస్తున్న ప్రాంతాలను పసిగట్టడంతో నిందితులు చివరకు తప్పించుకోలేమని నిర్ధారణకు వచ్చి కరీంనగర్‌కు చేరుకున్నారు. నేరాలను చేధించడంలో పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీ ఈ కేసు చేధనతో మరోసారి నిరూపితం అయిందని సీసీ కమలాసన్ రెడ్డి తెలిపారు.