(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్ జనవరి 27: దక్షిణ భారతదేశంలో వివిధ కులాలు, జాతుల పేర్లతో ఉనికిలో ఉన్న మత్స్యకారులంరినీ సంఘటితం చేసి, వారిని సామాజికంగా ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి అమలుపరచాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా “దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక”ను ఏర్పాటు చేసినట్లు ఐక్యవేదిక కన్వీనర్ గా ఎంపికైన ”తెలంగాణ ఫిషరీస్ సొసైటీ” వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ తెలిపారు.
గత ఆదివారం నాడు కర్నాటకలోని మంగళూరు నగరంలో జరిగిన “దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక” ఏర్పాటు సమావేశంలో కర్నాటక, తమిళనాడు,కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ర్టాలతో పాటు, పాండిచ్చేరి, లక్ష్యదీవులు, అండమాన్ నికోబార్ దీవుల నుండి హాజరైన వివిధ మత్స్యకార జాతుల/కులాల ప్రతినిధుల సమావేశంలో ఈ ఐక్యవేదిక కమిటీ కన్వీనర్ గా పిట్టల రవీందర్ ను కర్నాటక విధానం సభ సభ్యులు (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ సబ్బన్నా తల్వార్ ప్రతిపాదించగా, హాజరైన ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకున్నారు.
కాగా పిట్టల రవీందర్ తెలంగాణ ఫిషరీస్ సొసైటీ స్థాపించి దేశ వ్యాప్తంగా జల సేధ్యం, మత్స్యకార జాతుల స్థితిగతుల గురించి అధ్యయం చేస్తూ ప్రణాళికలు రూపొందిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. దేశవిదేశాల్లో జరిగే సెమినార్లలో పాల్గొంటు ఆధునిక శాస్త్రసాంకేతిక పద్దతుల ద్వార చేపల పెంపకం, చేపలు ఆహారంగా తీసుకుంటే మనిషి కలిగే ఆరోగ్య పరమైన లాభాలను విశదీకరిస్తూ వివిధ ప్రతికల్లో ఎన్నో వ్యాసాలు రాసారు.
భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో గంగపుత్ర, గంగా మాత, ముదిరాజు, కబ్బలిగ, తెనుగు, కోళీ, ముత్తరాయర్, ధీవర, అరయ, మఘవీరలాంటి అనేక జాతులుగా, ఉపకులాలుగా విడిపోవడం వల్ల ఈ జాతులకు సంబంధించిన ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి పోతున్నారని, ఈ జాతులు, కులాల మధ్యన ఐక్యతను సాధించేందుకు అవసరమైన సమన్వయాన్ని చేసేందుకు ఈ “దక్షిణ భారతీయ మత్స్యకార జాతుల ఐక్యవేదిక” కృషి చేస్తుందని, ఇందుకు మత్స్యకార జాతులకు సంబంధించిన సంఘాలు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని కొత్తగా కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన పిట్టల రవీందర్ కోరారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు పిట్టల రవీందర్‌ను ఘనంగా సన్నానించారు.