– రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 18ః సింగరేణి కాలనీలలో పారిశుధ్య నిర్వహణ నగర పాలక సంస్థ కు అప్పగించాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ సంస్థ డైరెక్టర్ బలరాంను కోరారు. ఈ మేరకు బుధవారం గోదావరిఖనికి వచ్చిన డైరెక్టర్ బలరాంను ఇల్లందు గెస్ట్ హౌజ్ లో కలిసారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ, సింగరేణి సంస్థ వేర్వేరుగా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్న క్రమంలో సమన్వయం కొరవడి తరచుగా కాలనీలలో అపరిశుభ్రత నెలకొంటుందని పేర్కొన్నారు. తద్వారా నగరంలో అనారోగ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి ఒకే సంస్థ ద్వారా పారిశుధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉందన్నారు. నగర పాలక సంస్థ వద్ద అవసరమైన యంత్రాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నoదున సింగరేణి ప్రాంతాల లోనూ పారిశుధ్య నిర్వహణ చేపట్టడానికి నగర పాలక సంస్థ సిద్దంగా ఉందని తెలిపారు. అయితే పారిశుధ్య నిర్వహణకు ప్రస్తుతం సింగరేణి సంస్థ వెచ్చిస్తున్న వ్యయానికి సమానమైన మొత్తాన్ని నగర పాలక సంస్థ ఖాతాలో ముందుగా జమ చేయాలని కోరారు.
అలాగే మురుగు నీరు గోదావరిలో నేరుగా కలవకుండా 2 ఇంక్ లైన్ , 5 ఇంక్ లైన్ కాలువల గుండా వస్తున్న వ్యర్థపు నీటిని శుద్ధి చేయడానికి తగినన్ని నిధులు మంజూరు చేసి సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు. అంతేకాకుండా నత్త నడకగా సాగుతున్న మునిసిపల్ కార్యాలయం నుoడి 5 ఇంక్ లైన్ రహదారి నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.
మేయర్ వెంట నగర పాలక సంస్థ డిప్యుటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు , ఆర్ జి 1 జి ఎం నారాయణ, సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి తదితరులు ఉన్నారు.