– ‘మావో’లు జనజీవనంలోకి రావాలి…
– సహకరిస్తే కఠిన చర్యలు…
– ఓఎస్‌డీ శరత్ చంద్ర పవర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 17: ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని, హింసను ప్రేరేపించే ‘మావో’లు జనజీవనంలోకి రావాలని రామగుండం పోలీసు కమిషనరేట్ ఓఎస్‌డీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు అంశాలు ప్రస్థావించారు.
మావోయిస్టులకు ఎవరూ సహకరించినా కఠిన చర్యలుంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రస్తుతం మావోయిస్టుల అలజడి నేపథ్యంలో జిల్లాలో ఏలాంటి అవాంచ నీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు శరత్ తెలిపారు.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ఏసీపీలు, సిఐలు, ఎస్‌ఐలు సమాచారం తెలుసుకుంటూ, అధికారులను అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు మళ్ళీ ప్రజల కోపానికి గురికాకూడదని హెచ్చరించారు. ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో మావో యిస్టులు తిరిగి అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని శరత్ చంద్ర తెలిపారు.
తెలంగాణ-మహరాష్ట్రాల నుండి కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహనలను తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసు ప్రత్యేక బలగాలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ, మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో కూంబింగ్ చేపట్టా మన్నారు. తీవ్రవాద ప్రభావిత గ్రామాల్లో నిత్యం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తు, ప్రజలతో మమేకమై సమావేశం నిర్వహిస్తూ, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితాన్ని పొందాలని ఓఎస్‌డీ సూచించారు. మావోయిస్టులు ఎవరి వద్దనైనా స్వచ్ఛందంగా పోలీస్ అధికారుల వద్ద గాని, ప్రభుత్వ అధికారులు వద్దగాని లొంగిపోచ్చని పేర్కొన్నారు. లొంగి పోయిన మావోలకు ఎలాంటి హాని జరగదని తెలిపారు. ఇప్పటికైనా హింసను విడనాడాలని కోరారు. హింసకు ప్రజాస్వామ్యంలో మనుగడ లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టు లందరికీ ప్రభుత్వం పునరావాస కల్పించి అన్ని రకాల సహాయ సహకారాలు కల్పిస్తుందని శరత్ చంద్ర పవర్ తెలిపారు.
గ్రూపు తగాదాలతో మావోయిస్టు నేతలు ఒకరికి మించి ఒకరు లేఖలు రాస్తూ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రైతులను పీడిస్తున్నారని తెలిపారు. మావోయిస్టులు బంద్‌లు, వారోత్సవాల పేరుతో రోడ్లను తవ్వడంతో వర్షాకాలంలో గిరిజన ప్రజలు వైద్య సదుపాయం కోసం ఆసుపత్రులకు, నిత్యావసరాల వస్తువుల కోసం మార్కెట్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వైద్య, విద్య సదుపాయాల అభివద్ధి జరగకుండా అడ్డుకుంటు న్నారని, గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించడానకి సరైన రవాణా సౌకర్యం లేక, వాగులు దాటలేక గర్భిణీలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. పేద ప్రజలు, మహిళల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్, ఆజాద్ బాధ్యత లాంటి వారు దీనికి బాధ్యత వహిస్తారా అని శరత్ చంద్ర ప్రశ్నించారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజన ప్రాంతాల్లోని ప్రజల అభివద్ధికి, వారి సంక్షేమానికి అడ్డుపడ కుండా జనజీవన స్రవంతిలో రావాలని మావోలకు సూచించారు. యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని పిలుపునిచ్చారు. మావోలు గాని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సంబందిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను ఓఎస్‌డీ శరత్ చంద్ర పవర్ కోరారు.