– ఆధునిక టెక్నాలజీతో గోదావరిని శుద్ధి చేయాలి
– టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి ప్రకాశ్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 29: వేల కోట ్లరూపాయలు ప్రభుత్వ డబ్బు ఖర్చుపెట్టి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ నీళ్లల్లో దుర్ఘంధం తాండవిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు తాగు, సాగు నీటికి ఎలాంటి కష్టాలు ఉండవని టీఆర్‌ఎస్ ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేసు కుంటుందే తప్ప నిల్వవున్న నీటిలోలో చెత్తచెదారాలు వివిధ రకాల వ్యర్ధాలు కలిసి గోదావరి నది దుర్ఘంధపూరిత మయి పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రజల ఆనారోగ్యాల పాలవు తున్నారని ప్రకాశ్ ఆరోపించారు. ప్రభుత్వం గోదావరి నది నీటిని శుద్ధి చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా స్నానఘట్టాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా, దయనీయంగా వుందని పేర్కొన్నారు. గోదావరి నది మురుగు వ్యర్థాలతో దర్శనమిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నీటితో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తే నీరు నోట్లోకి పోతే భక్తులు రోగాల బారిన పడటం ఖాయమన్నారు.
ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా దౌర్భాగ్య స్థితిలో రామగుండం నగరపాలక సంస్థ వుందన్నారు. పండగ వేళ ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించాలంటే మురుగు నీటిలో మూడు మునకలు ఎలా వేయాలి అని సందేహం వ్యక్తం చేస్తున్నారని ప్రకాశ్ తెలిపారు. ఉన్న వనరులను కాపాడుకోలేని, బాగు చేయలేని నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అభివద్ధి చేస్తాం అని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా హుటాహుటిన గోదావరి నదిలో ఉన్నటువంటి చెత్తను తొలగించడానికి ఆధునిక టెక్నాలజీని వాడాలని, టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలను కొనుగోలు చేయాలని వాటి ద్వారా గోదావరి నదిని శుద్ధిచేసే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని పెద్దెల్లి ప్రకాష్ పాలకవర్గాన్ని డిమాండ్ చేశారు.