– సరఫరా చేసే వ్యక్తి అరెస్ట్
– కిలో గంజాయి స్వాధీనం
– ఎసీపీ గిరిప్రసాద్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 28: గంజాయి అమ్మినా, కొన్నా, సేవించినా కఠినచర్యలు తప్పవని ఎసిపి గిరి ప్రసాద్ పేర్కొన్నారు. యువకులకు గంజాయి సరఫరా చేసే దేవోజి వేణు అనే నిందితుణ్ణి బుధవారం పోలీసులు అరెస్టు చేసారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుని అరెస్ట్ వివరాలు ఎసిపి తెలిపారు.
గంజాయి అమ్మడం కోసం రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని రాంనగర్ రైల్వే పట్టాల వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతుండగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్సై ఉమాసాగర్ తన సిబ్బందితో వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. తనిఖీ చేయగా అతని వద్ద కిలో గంజాయి దొరికింది. అతను గోదావరిఖని రాంనగర్ కు చెందిన దేవోజి వేణు గా గుర్తించారు. వెంటనే సీఐ రమేష్ బాబుకు సమాచార మందించగా, రామగుండం డిప్యూటీ ఎమ్మార్వో బత్తిని కిరణ్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం అతన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న సిఐలు జి.రమేష్ బాబు, యస్. రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై ఉమా సాగర్, ఏ ఎస్సై మల్లయ్య, కానిస్టేబుళ్ళు హేమసుందర్, తీట్ల శ్రీనివాస్, గోపతి వెంకటేష్ , హోం గార్డ్ శేఖర్ లను ఏసిపి అభినందించారు.
కాగా ఈ సందర్భంగా ఎసీపీ గిరిప్రసాద్ మాట్లాడుతూ యువత ఎక్కువగా గంజాయికి బానిసలై, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ, నేరాలకు పాల్పడుతున్నారనిపేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి కదలికలను, ప్రవర్తనను నిశితంగా గమనించాలని కోరారు. ముఖ్యంగా వారు ఎవరితో స్నేహం చేస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో, వారందరి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా, డయల్ 100 కి గాని, నేరుగా తమకు గాని సమాచారం ఇచ్చి, యువతను చెడు మార్గం వైపు వెళ్లకుండా సహకరించాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.