Home తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం

హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం

529
0
Huzurabad all set for by-election polling
Election Officer Collector R.V. Karnan Speaking at a press conference,

పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తాం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 27:  హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలిస్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలిసి హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 30 న జరుగు హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 1,17,933 మంది, స్త్రీలు 1,19,102 మంది, ఇతరులు ఒక ఓటరు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికలను కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్ అని, అనగా 27-10-2021 సాయంత్రం 7 గంటల నుండి 31-10-2021 వరకు హుజురాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదని తెలిపారు. 5 గురు కన్న ఎక్కువ గుమికూడ వద్దని అన్నారు. పోలింగ్ రోజు వరకు ఇంటింటి ఎన్నికల ప్రచారం 5 గురిని మించకుండా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఉప ఎన్నికల నిర్వహణకు ఈవియంలలో మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివిప్యాట్ లను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు మొత్తం 1715 మంది పోలింగ్ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో 1224 మంది పీ.ఓ/ఏ.పి.ఓ/ ఓ.పి.ఓ లు, 491 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచినట్లు ఆయన తెలిపారు. హుజురాబాద్ జూనియర్ కాలేజిలో ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని, ఈ నెల 29 న పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కెంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. పొలింగ్ సిబ్బంది అందరూ కోవిడ్ రెండు డోసుల టీకా తీసుకున్నవారికి విధులు కేటాయించినట్లు తెలిపారు.

పోలింగ్ సందర్భంగా 306 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి హుజురాబాద్ నియోజకవర్గంకు ప్రచార నిమిత్తం వచ్చిన ఓటర్లు కాని స్థానికేతర్లు వారు నియోజకవర్గంలో ఉండకూడదని తక్షణమే విడిచి వెళ్లాలని ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తేది.28-10-2021 సాయంత్రం 7 గంటల నుండి 30-10-2021 వరకు డ్రై డే గా ప్రకటించామని, అన్ని మద్యం షాపులు, మద్యం విక్రయించే హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు, మొదలగునవి మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇతర పబ్లిక్ లేదా ప్రైవేట్ స్థలాలలో 100 మీటర్లలోపు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్లలోపు ఎలాంటి ప్రచారాలు చేయకూడదని ఆయన తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో 97 శాతం ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని తెలిపారు. ఓటర్లు స్లిప్పులు ఓటు హక్కు వినియోగించుటకు గుర్తింపు కార్టు కాదని ఓటర్లు తప్పనిసరిగా ఎలక్ట్రోరల్ ఫోటో గుర్తింపు (ఎపిక్) కార్డు లేదా కెంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 11 గుర్తింపు కార్డులు ఆధార్ కార్డ్, ఉపాధి హామి జాబ్ కార్డ్, బ్యాంకు/పోస్టాఫిస్ పాసు పుస్తకం, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్స్ ఇన్సురెన్సు స్మార్ట్ కార్డ్,  డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్టు, ఫోటోతో గల పెన్షన్ డాక్యుమెంట్, ఉద్యోగుల సర్వీసు గుర్తింపు కార్డు, ఎంపిలు,/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్.పి.ఆర్. స్మార్ట్ కార్డులను వెంట తీసుకొని వెళ్లి ఓటు హక్కుని వినియోగించు కోవచ్చని ఆయన తెలిపారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పకడ్బంధీగా అమలు చేస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల హెల్ప్ డెస్క్, హెల్త్ డెస్క్ లను ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాలకు మాస్కులు లేకుండా వచ్చు ఓటర్లకు మాస్కులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలింగ్ కెంద్రాలకు ప్రవేశానికి ముందు ప్రతి ఓటరు చేతులను శానిటైజర్ చేయుటకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కెంద్రంలో హెల్త్ వర్కర్ థర్మామీటర్ తో టెంప రేచర్ పరిక్షిస్తారని తెలిపారు. ఓటర్లు ఈ.వి.యం బ్యాలెట్ యూనిట్ బటన్ ప్రెస్ చేయుటకు కుడిచేతికి గ్లౌజులు సరఫరా చేస్తారని తెలిపారు. పోలింగ్ కెంద్రాలలో ఓటర్ల క్యూలైన్లలో ఓటరుకు ఓటరుకు మధ్య 6 ఫీట్ల దూరం ఉండేలా సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లను శానిటైజింగ్ చేయించామని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ రోగులకు పిపిఈ కిట్లను సమకూర్చా మని, ఎక్కువ టెంపరేచర్ తో బాధపడే వారికి పోలింగ్ చివరి సమయంలో ఓటు హక్కు వినియోగించు కొనుటకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.

పోలిస్ కమిషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ బుధవారం 7 గంటల నుండి హుజురాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలిపారు. ఓటర్లు కాని స్థానికేతరులు తక్షణమే హుజురాబాద్ నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ న్యూస్ వస్తున్నాయని ప్రజలు అట్టి ఫేక్ స్యూస్ నమ్మకూడదని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు హక్కుని వినియో గించు కొనుటకు 3,865 మందితొ పోలిస్ బందోబస్తు ఏర్పటు చేశామని తెలిపారు. ఇందులో 20 కంపెనీల కెంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలిసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలిసులు, 1471 మంది ఇతర జిల్లాల నుండి పోలిసులను ఎన్నికల బందోబస్తుకు నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని తెలిపారు. ఓటర్లు సైలెన్స్ పీరియడ్ లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, జిల్లా పౌర సంబంధాల అధికారి అబ్దుల్ కలీం, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ సి.హెచ్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here