రామగుండం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ ఆగస్టు నెల మూడవ వారంలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల మేనిఫెస్టోను అక్టోబర్ 15న విడుదల చేశారు.
వందలాది మంది జనం వెంటరాగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, తిరిగి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే మేనిఫెస్టోను వివరిస్తున్నారు. కెసిఆర్ సంక్షేమ పథకాల పట్ల, తన పాలన పట్ల ఆకర్షితులై చేరుతున్న వారిని పార్టీలోకి స్వాగతిస్తున్నారు. తమకు ప్రతినెలా ఆసరా పెన్షన్ అందుతోందని వృద్దులు చెబుతుంటే..కళ్యాణలక్ష్మి పథకంతో బిడ్డ పెళ్ళికి చేసిన అప్పు తీరిందని మహిళలు సంబరంగా చెప్తున్నారు.
మిషన్ భగీరథతో నీళ్ళ గోస తీరిందని, రోడ్లు బాగయ్యాయని కేసీఆర్ తమ దేవుడని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రం కాకపోయినా మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తమ బిడ్డల భవిష్యత్ ఆలోచించి ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ సాధించారని, మా యింటి పట్టా మీరిచ్చిందేనని, ఆశలు వదిలేసుకున్న ఖుర్జ్ కమ్మీ భూములకు పట్టాలిప్పించారని చందర్‌ను ప్రశంసిస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏంటో చేసిచూపించిన మిమ్మల్నే అధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించుకొంటామని, రామగుండాన్ని దత్తత తీసుకుని మరో సిరిసిల్ల, సిద్దిపేట చేయడం కోసం మీ గెలుపును మంత్రివర్యులు కేటీఆర్ కు బహుమతిగా ఇస్తామని స్వచ్ఛందంగా చెప్తుండడంతో బిఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనబడుతోంది. కాగా తాము గెలిస్తే ఏం చేస్తారో ఇతర పార్టీల అభ్యర్థులు చెప్పుకోవాల్సి వస్తుందని, తాను చేసిన పనులను చూస్తున్న ప్రజలే తనను మళ్ళీ గెలిపిస్తారని చందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.