(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 9: తెలంగాణ జాతి అస్థిత్వానికి ప్రతీక కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళొజీ నారాయణ రావు 106 వ జయంతిని జరిపారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరేమీ చెప్పినా ఆయన మనసులో నుండి వచ్చిన మాటలను ఆచరించే గొప్ప వ్యక్తి కాళోజి అని, అలా ఆచరించే వారు చాలా అరుదని అన్నారు. ఆదర్శాలు వల్లించడం వేరు దాన్ని ఆచరించడం వేరు అవి రెండు సాధ్యమేనని చేసి చూపించిన వ్యక్తి కాళొజీ నారాయణ రావు అని తెలిపారు. ఒక ఉద్యమకారుడిగా, భాషా అభిమానిగా, కవిగా, ఒక సిద్ధంతా కర్తగా ఎన్నో రూపాల్లొ సమాజానికి సేవ చేసిన వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు. ఒక ప్రజా కవిగా బిరుదు పొందిన వ్యక్తి అని, మానవతా వాదిగా మానవత్వమే ప్రధాన అజెండాగా పని చేసిన వ్యక్తి అని తెలిపారు. పి.వి.నరసింహ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళోజీ నారాయణ రావుకు పద్మవిభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిందని పేర్కొన్నారు. మన కవిత్వాన్ని, కథలని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి కాళోజీ నారాయణ రావు అని తెలిపారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా గాని, వ్యవస్థ పై పెత్తనం చెలాయించే వారు ఎవరు ఉన్నా గాని దానిలోని లోపాలను ఎలిగెత్తి చాటిన వ్యక్తి కాళోజీ నారాయణ రావు అని ఆయన పేర్కొన్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన కథలు, ఆయన మాటలు మనలను కొద్దిగా ఇబ్బంది పెట్టిన అధికారులను అన్నట్టుగా అనిపించిన గాని, ఆ వ్యవస్థ మారాలంటే ఇటువంటి చైతన్యం కలిగిన వ్యక్తి నిత్యం చలనంతో గడిపిన వ్యక్తులని అన్నారు. కాళోజీ రచనలు, రాసిన కథల నుంచి మనం అందరం స్పూర్తి తీసుకోవాలన్నారు. వ్యవస్థ అన్నది, సమాజం అన్నది ఒక వ్యక్తితోటో, ఏ ఒక్క సమూహం తోటో ఏర్పడేది కాదని, వాటిలో మార్పు రావాలంటే వ్యవస్థీకృతంగా మనం ఆదర్శవంతమైన మార్గంలోకి నడవాలంటే కాళొజీ నారాయణ రావు లాంటి చైతన్యం కలిగిన కవులు రాసిన రచనలు, వారి కవిత్వాలు, కథల ద్వారా స్పూర్తి పొందుతూ మనలో ఏ రకమైన మార్పు రావాలనే అంశం ఒకసారి మననం చేసుకొవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాళొజీ నారాయణ రావు గొప్పతనాన్ని నెమరు వేసుకోవడానికి అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ.నరసింహ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, పి.డి. మెప్మా రవిందర్, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.