(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పెద్దపల్లి, నవంబర్ 2ః తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆశావర్కర్లందరు మంగళవారం వైద్యాధికారి కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేసారు.
కరోనా (కోవిడ్-19) కష్టకాలంలో గత సంవత్సన్నర కాలంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, భర్త, పిల్లలు, అత్తామామలు వదిలిపెట్టి ప్రజలకు సేవలందించిన మాకు తగిన గుర్తింపు లభించడం లేదని వాపోయారు. విపరీతమైన పని భారాన్ని మోపుడమే కాకుండా కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదని విచారం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తమ యూనియన్‌కు అనుబంధంగా ఆశా వర్కర్ల యూనియన్ పనిచేస్తుందని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అన్ని రకాల సేవలందించింది ఆశా వర్కర్లేనని తెలిపారు. అయినప్పటికి వారికి తగిన గుర్తింపు, కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదని తెలిపారు. వారితో వెట్టి చాకిని చేయుస్తూ కనీస వేతనాలు కల్పంచడం లేదని పేర్కొన్నారు. వారిపై విపరీతమైన పని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.
ఇప్పటికైన వారిని గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా వైద్యాధికారిని డిమాండ్ చేసారు. 8 గంటల పని, కనీస వేతనాలు, పండుగ సెలవులు, వారాంతపు సెలవులు లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా వైద్యాధికారిని కోరారు.