
– రాష్ట్ర బీసి సంక్షేమ & పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 9: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సద్దుల బతుకమ్మని, ఆడబిడ్డలకు పండుగ కానుకగా బతుకమ్మచీర ఇస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ & పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కిసాన్ నగర్ 3వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.శశాంక, నగర మేయర్ వై.సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ అని, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో దేవుళ్లను పూలతో కొలుస్తామని, కానీ పూలనే ఒక దేవునిలాగా తయారు చేసుకుని ఆడుకునే పండుగనే బతుకమ్మ పండుగ అని మంత్రి అన్నారు. ప్రకృతిని దైవంగా భావించేది తెలంగాణ ప్రజలని, నీరు గాలి లాగానే పూలను కూడా దైవసమానంగా భావించుకుని మమ్మల్ని కాపాడు అని బతుకమ్మ పండుగను ఆడుకోవడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి, తెలంగాణ పండుగను గౌరవించుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. నిరుపేదలైనా పండుగను సంబరంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక అన్నగా, తోబుట్టువుగా ప్రతి సంవత్సరం ఒక చీరను కానుకగా ముఖ్యమంత్రి పంపిస్తున్నారని మంత్రి తెలిపారు. నేతన్నలకు చేయుతనివ్వాలనే ఉద్దేశ్యంతో నేతన్నలు నేసిన చీరలు ప్రభుత్వమే కొనే విధంగా, కొన్న చీరలను తెలంగాణ ఆడబిడ్దలకు ఉచితంగా ఇవ్వడం జరుగు తుందని అన్నారు.
5 సంవత్సరాలుగా 5 కోట్ల బతుకమ్మ చీరలను సిరిసిల్ల నుండి కొనుగోలు చేయడం వలన సిరిసిల్లలోని నేతన్నలు ఆత్మగౌరవంగా బతుకుతున్నారని అన్నారు. దాదాపు 4-5 రోజుల పాటు ప్రతి ఇంటికి కూడా వెళ్లి, అర్హులైన ప్రతి మహిళకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రేషన్ షాపుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి సోదరికి ఇవ్వడం జరుగుతుందని అలాగే మంచి డిజైన్లతో దాదాపు 275 డిజైన్లతో చేయడం జరిగిందని అన్నారు.280 రంగుల్లో టెక్స్ టైల్ మినిస్టర్ కేటిఆర్ స్వయంగా పర్యవేక్షించి మంచి డిజైన్లను తయారు చేయించారని తెలిపారు. ఈ చీరలను ప్రేమతో తీసుకుని రాబోయే రోజులలో పండుగ బాగా జరుపుకోవాలని కోరారు.

నగర మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి ఇంటింటింకి అందిస్తున్న ఈ చీరను స్త్రీలందరూ ఎంతో పవిత్రంగా ఒక ముఖ్యమంత్రి తన సోదరునిగా ప్రతి మహిళకు కూడా పంపిస్తున్న కానుకగా భావించి తీసుకుంటున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీని ఈరోజు ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రతి పండులను కూడా గౌరవించే ఆనవాయితీ కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నడుస్తుందని ఆయన అన్నారు. క్రిస్టియన్స్ కు క్రిస్ మస్ పండుగ సందర్భంగా, ముస్లింస్ కు రంజాన్ గిస్ట్ గా, తెలుగు వారికి బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ చీరలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాల సంస్థ కమీషనర్ వల్లూరి క్రాంతి, డిప్యూటి మేయరు చల్ల స్వరూప రాణీ, ఆర్డీఓ ఆనంద్ కుమార్, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.