Home తెలంగాణ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారుపై బీఆర్‌ఎస్‌ జంగ్‌ సైరన్‌

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారుపై బీఆర్‌ఎస్‌ జంగ్‌ సైరన్‌

471
0
BRS Jung Siren Against BJP
Ramagundam MLA and Peddapalli District BRS President Korukanti Chander

– యుద్దభేరి ‘మహాధర్నా’కు పిలుపు నిచ్చిన రామగుండం  ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఏప్రిల్‌, 7: సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మరోమారు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జంగ్‌ సైరన్‌ పూరిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్‌ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు ఈనెల 8న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో యుద్ధ బేరి ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి, చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడు తోందని ఆయన ఆరోపించారు. తాజాగా సింగరేణిలోని బొగ్గు గనుల వేలానికి కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో భారీ స్థాయిలో యుద్దబేరి ‘మహాధర్నా’ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికే పలుమార్లు గనులను వేలంవేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులను నేరుగా సింగరేణికి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు కోరినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు సైతం ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరుతున్నా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని, ఇక్కడి ప్రజలకు ఇదే ప్రధానమైన బతుకుదెరువన్నారు. తెలంగాణను దెబ్బ కొట్టాలని, ఇక్కడి ప్రజల బతుకులు ఆగం చేయాలనే దురుద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను బిఆర్‌ఎస్‌ తరపున, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. ఈ మేరకు సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను, తన అనుంగు మిత్రుల కోసం అప్పనంగా అమ్మేస్తున్న ప్రధాని మోడీ, సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా, నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగంగానే జూటా మాటల మోడీ పావులు కదుపుతున్నారని, అందుకే నవంబర్‌ 12, 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానమంత్రే సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చి, తప్పారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం… అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తోందన్నారు..!

పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో… ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను సాగనివ్వమని కోరుకంటి చందర్‌ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైకోమాట చెప్తూ… లోపల కుట్రకు తెర లేపుతోందన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికోపాలసీ అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. గుజరాత్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు మాత్రం నామినేషన్‌ పద్ధతిన భారీగా లిగ్నైట్‌ గనులు కేటాయించిందన్నారు. గుజరాత్‌ మాదిరిగానే తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌ పై అపార ప్రేమను కనబరుస్తున్న దేశ ప్రధాని మోడీ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నవంబర్‌ 12, 2022న సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చిన మోడీ నిలుపుకోలేకపోయారని, ప్రధాని హామీకే దిక్కులేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రానికి మరోసారి రాబోతున్న ప్రధాని మోడీ దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్‌ఎఫ్‌ లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో కేంద్ర ప్రభుత్వంలోని, బీజేపీలోని ఏ ఒక్కరికైనా చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని ఎమ్మెల్యే చందర్‌ అన్నారు.

రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న సీఎం కేసిఆర్‌ సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు. బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ దురుద్దేశమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీసి.. తద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కరెంట్‌ లేకుండా చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర థర్మల్‌ పవర్‌ జనరేషన్‌లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. రైతులతోపాటు రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ ఫలాలకు గండికొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. అందుకే ఉచిత పథకాలను… అనుచితాలని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడం, ఆయనకు పేదప్రజలపై ఉన్న కక్షపూరిత వైఖరిని వెల్లడిస్తోందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో, కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని మండిపడ్డారు.

తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్‌ సైరన్‌ మోగిస్తామని…మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటీకరించే కేంద్రం కుట్రలు ఫలిస్తే.. తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందని, సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయని చందర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ, తానూ ప్రతిసారి అండగా ఉంటున్నామని గుర్తుచేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్ర సాధనలు ముఖ్య భూమిక పోషించిందన్నారు. ఈ సారి పురుడుపోసుకునే మహోద్యమంలో బొగ్గు అగ్గై మండుతుందని, కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని ఎమ్మెల్యే కోరుకంటి హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ఆగాలంటే జంగు సైరన్‌ మోగాల్సిందేనని, సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు కదన రంగానికి కదలి వచ్చి, యుద్దబేరి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here