– చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
– వివరాలను వెల్లడించిన ఆడిషినల్ డిసిపి అశోకుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి) :
గోదావరిఖని సెప్టెంబర్ 24: వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రామగుండం పోలీసు కమిషనరేట్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,13,500 విలువైన వెండి, బంగారు, నగదు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆడిషినల్ డీసీపీ అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ రోడ్ రామ క్రిష్ణాపూర్ వద్ద సిసిఎస్ పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి ఒక వ్యక్తి తను ప్రయాణిస్తున్న మోటార్ సైకల్‌ని రోడ్డు పక్కన పార్క్ చేసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని, అతని వద్ద వున్న బ్యాగును సోదా చేయగా అందులో బంగార వెండి ఆభరణాలు వున్నందున విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు. అంతే కాకుండా అతను వాడిన వాహనం కూడా దొంగిలించినదే నని ఒప్పుకున్నట్లు డీసీపి పేర్కొన్నారు. ఇతను మందమర్రి చెందిన టేకం రాము అలియాస్ టాకూర్ రాముగా ఒప్పుకున్నట్లు డీసీపి తెలిపారు. తాగుడు, ఇతర చెడు వ్యసనాలకి బానిసై కూలి డబ్బులు సరిపోక దొంగతనం చేసి విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు డీసీపి పేర్కొన్నారు.
ఆ క్రమంలోనే తాళం వేసిన ఇండ్లను చూసుకొని దొంగతనాలకు పాల్పడే వాడని చెప్పారు. గతంలో మంచిర్యాల, కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలో దొంగతనాలకు పాల్పడట్టు వివరించారు. 30 చోరీలకు సంబంధించిన వివిధ కేసులలో జైలు శిక్షను అనుభవించి ఇటీవలే విడదలయ్యాడని అయినప్పటికీ తాగుడుకు బానిసై, జల్సాలకు అలవాటు పడి చోరీలను మాత్రం మానలేదని డీసీపీ పేర్కొన్నారు. ఈ క్రమంలో సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డిసిపి తెలిపారు. అంతేకాకుండా ఇతని సహకరిస్తున్న హుస్నాబాద్‌కు చెందిన మురిమూరి రంజిత్ కూడా అరెస్టు చేసినట్లు డీసీపి తెలిపారు. వీరిద్దపై వివిధ సెక్షన్లలలో కేసు నమోదు చేసినట్లు డీసీపి అశోక్ కుమార్ వెల్లడించారు.