(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 24: కేంద్రంలోని బిజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఆర్జీవన్ జియం ఆఫీసు ముందు బుధవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణ, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ ధర్నాను చేపట్టారు.
ఈ ధర్నాలో తెలంగాణ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి, ప్రభుత్వ రంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమను ప్రైవేటికరిస్తూ గుత్తా పెట్టుబడిదారులకు లాభాలు చేకూరుస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెేసీఆర్ కారుణ్య నియామకాల పేరుతో కొంత మంది వారసులకి ఉద్యోగాలు వస్తున్నప్పటికీ, 65వేలుగా ఉన్న కార్మికుల సంఖ్యను 40వేలకు కుదించారని ఆందోళ వ్యక్తం చేసారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో అనేక హక్కులు హరించబడు తున్నాయని ఆరోపించారు. డిఎ లెక్కింపులో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, అలవెన్స్ లపై ఇన్‌కంటాక్స్ కోల్ ఇండియాలో కార్మికులకు తిరిగి చెల్లి ఇస్తుంటే, సింగరేణి యాజ మాన్యం కార్మికులకు చెల్లించటం లేదని తెలిపారు. 11వ వేతన కమిటీ వేసి చర్చను ప్రారంభించాలని, సిఎంపిఎఫ్‌ను ఇపిఎఫ్‌లో కలిపే ప్రతిపాదనను విరమించు కోవాలని, సిఎంపిఎఫ్ జమా లెక్కలు సత్వరమే కార్మికులకు అందించాలని డిమాండ్ చేసారు.
గుర్తింపు సంఘంగా ఉన్న టిబిజీకెఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోగా, నాయకులకు పుట్టినరోజులు జరుపుతూ, పాలాభిషేకాలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేసారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కేవలం పైరవీలకే పరిమితమై పనిచేస్తుందని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల కార్మికులకు అనేక విషయాలలో రావలసిన హక్కుల్ని కూడా రాకుండా పోతున్నాయని అన్నారు, హక్కుల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
కార్మికుల అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. లేదంటే దశలవారీ ఆందోళనలు కార్యక్రమాల ద్వారా కార్మికులను చైతన్యం చేస్తూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ధర్నా అనంతరం ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రమేష్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా కార్యదర్శి వేల్పుల కుమారస్వామి, ఆర్జీవన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్, నాయకులు అసరీ మహేష్, జే.గజేెందర్, సి.హెచ్.వేణుగోపాల్ రెడ్డి, కారం సత్తయ్య, వంగల రాములు, బూర్గుల రాములు, బొగ్గరం శ్రీనివాసరావు, భీమానాయక్, తనుగుల సతీష్, రవి కిరణ్, ఆరేపల్లి రాజమౌళి, సిహెచ్ లక్ష్మణ్, రాయమల్లు,జే శెంకర్,రవీందర్ రెడ్డి, నంది నారాయణ, బి రవి, సంతోష్ కుమార్,మురళి, దుర్గం నారాయణ, నిర్ల శ్రీనివాస్, నాగిరెడ్డి వీరయ్య అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు,