– కరీంనగర్ అడిషనల్ పోలీస్ కమిషనర్(ఎల్‌అండ్‌ఓ) ఎస్ శ్రీనివాస్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంగనర్, అక్టోబర్ 4: పోలీస్‌శాఖ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఫిర్యాదులు చేసేందుకు మహిళలు, విద్యార్థినిలు ధైర్యంగా ముందుకు రావాలని పోలీస్ అడిషనల్ కమిషనర్(ఎల్‌అండ్‌ఓ) ఎస్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మానేరుడ్యాం వద్ద పోలీస్ కళాబృందంతో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్(ఎల్‌అండ్‌ఓ) ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు తాము ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపులను మౌనంగా భరించకూడదని తెలిపారు. నేరుగా రావాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం మహిళలు, విద్యార్థినులు షీటీంల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్‌శాఖ మహిళలు, విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నదని చెప్పారు. పోకిరీల ఆగడాలను నియంత్రిం చేందుకు షీబృందాలు మఫ్టీలో గస్తీ నిర్వహిస్తున్నాయని చెప్పారు.
పోకిరీలను ఆధారాలతో పట్టుకునేందుకు కంటికి కనిపించని ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నాయని తెలిపారు. ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొనే మహిళలు, విద్యార్థినులు నేరుగా వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని, వాట్సాప్, వెబ్‌సైట్, హాక్‌ఐ లేదా సెల్‌ఫోన్‌ల ద్వారా సమాచారం అందించినా సత్వరం స్పందిస్తూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
పోలీస్ కళాబృందం సభ్యులు ఇంఛార్జి రామంచ తిరుపతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్‌నకు చెందిన సినీకళాకారులు గోవర్ధన్, కృష్ణమోహన్ తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్నారు.