– జిల్లా కలెక్టర్ కె.శశాంక:
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 4: సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. ఆదివారం రోజున ధరణి పోర్టల్ ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న వివరాలను మున్సిపల్ కమిషనర్ క్రాంతి, అదనపు కలెక్టర్ ఎ. నరసింహా రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి వీర బుచ్చయ్యలతో కలిసి పరిశీలించారు.
బ్యాంకు కాలనీ, తీగలగుట్టపల్లి, నగునూర్ లో పర్యటించి ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న సిబ్బంది పని తీరును పరిశీలించి ఏమైనా సమస్యలు ఎదురౌతున్నావని అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో, యజమానితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, మోబైల్ నెంబర్, ఆన్ లైన్ కు అవసరమైన డాక్యుమెంట్లు అన్ని సిద్ధం చేసుకోవాలనే విషయాన్ని వారికి ఒకరోజు ముందుగా తెలపాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీని వలన సిబ్బందికి పని తొందరగా పూర్తి అవుతుందని తెలియజేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సర్వే కోసం వచ్చిన సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భవన నిర్మాణాల పై ఇంటింటి ధరణీ సర్వే కరీంనగర్ లో ప్రశాంత సాగుతుందన్నారు. ధరణీ పోర్టల్ లో పొందు పరుస్తున్న వివరాలతో పాటు టెక్నికల్ సమస్యల పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు ఏర్పడిన టెక్నికల్ సమస్యల నేపధ్యంలో వాటిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి పర్యటించి పలు నివాస గృహాలకు సంబందించిన ధరణీ పోర్టల్ మోబైల్ ఆప్ ద్వారా వివరాలను పొందుపరిచారు. ధరణీ సర్వే చేస్తున్న సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.
పేద ప్రజలకు ముఖ్య మంత్రి కేసిఆర్ తమ ఆస్తులపై హక్కును కల్పించేందుకే ధరణీ పోర్టల్ ను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. సర్వే సిబ్బందికి వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారం సర్వేను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నగర ప్రజలు అన్ని రకాల డాక్యూమెంట్ ముందుగానే సిద్దం చేసుకొని సర్వేకు వచ్చే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహాకరించాలని కోరారు. నగర వ్యాప్తంగా ధరణీ పోర్టల్ సర్వే జరుగుతున్న తీరును.. సిబ్బంది ఎంట్రీ చేస్తున్న వివరాలను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ధరణి పోర్టల్ కు సంబందించిన టెక్నికల్ సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.