– ఎన్నికల నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సర్కార్ జీతాల పెంపు
– కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలి
– ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ…
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 17ః కరోనాకు వివక్ష లేదు.. కానీ సర్కారులో అది స్పష్టంగా కనిపిస్తున్నదని, వేతనాల పెంపులో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు సాక్ష్యమని సీపీఐ రామగుండం నగర సమితి నగర కార్యదర్శి కె. కనక రాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
కేవలం జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకే ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు, కార్మికుల పట్ల టీఆర్‌ఎస్ సర్కారు సవతితల్లి ప్రేమను ప్రదర్శింస్తుందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకే జీతాలు పెంచి ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పనిచేసే కార్మికులను విస్మరించడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పారిశుధ్య కార్మికులను మచ్చిక చేసుకునేందుకు టీఆర్‌ఎస్ సర్కారు ప్రయత్నాలు చేస్తుందనీ అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలను ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున పెంచింది. పెంచడం శుభపరిణామం అయినప్పటికీ రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పట్ల ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శించడం సరికాదని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, మన్సిపాల్టీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలను పెంచకపోవడమే ఇందుకు నిదర్శనం. మార్చి నుంచి కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నప్పటి నుంచి పారిశుధ్య కార్మికులు కరోనా వారియర్లుగా నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజలకు వైరస్ సోకకుండా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల పనితీరు పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరగింది పేర్కొన్నారు.
ప్రభుత్వం వారి పనితీరును ప్రశంసించింది. కానీ చేతల వరకు వచ్చేసరికి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నదనీ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికలు రానున్నా నేపథ్యంలోనే ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలను ప్రభుత్వం పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులంతా కరోనా వారియర్లుగా పనిచేశారు. కానీ ప్రభుత్వం కొందరికే జీతాలు పెంచి మిగిలిన వారి పట్ల వివక్షను ప్రదదర్శించడం సరికాదన్నారు.
రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీలున్నాయి. జీహెచ్‌ఎంసీలో 28 వేల మంది కార్మికులు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 32 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకే రూ.3 వేల చొప్పున జీతాలు పెంచి, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు పెంచకపోవడం అన్యాయమని తెలంగాణ జీహెచ్‌ఎంసీ కార్మికులతో సమానంగా ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులు విధులు నిర్వహిస్తున్నారనీ, జీతాల్లో మాత్రం తేడా ఎందుకని ప్రశ్నించారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ ఒకే వేతనం ఉండాలని సీపీఐ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.