– హెల్మెట్ ధరించండి.. జీవితాలను కాపాడుకోండి…
– ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌బాబు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 18: ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ప్రాణాలను ఫణంగా పెట్టకండి… హెల్మెట్ ధరించకుండా విలువైన జీవితాన్ని దూరం చేసుకోవద్దని రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.రమేశ్‌బాబు ద్విచక్రవాహనదారులకు హితవు పలికారు. ప్రస్తుత నేపథ్యంలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకుండా, ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్నారని తెలిపారు. వాటికి స్వస్తి పలికి అన్ని రకాల డాక్యుమెంట్లను వెంబడి వుంచుకొని ఈ-చలాన్లకు దూరంగా ఉండాలని కోరారు.
శనివారం సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల సమీపంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల సర్వీస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధా కరమని పేర్కొన్నారు. ద్విచక్రవాహనల మీద ఎదురెదురుగా ఢీ కొనడంతో బోగే వినేష్ (25), రంగు రాజ్ కుమార్ (20) తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారని సీఐ రమేశ్‌బాబు తెలిపారు. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించినట్లయితే చిన్న గాయాలతో బయటపడే వారని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే జరిమానా తప్ప ఏమికాదనుకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవాల్సివస్తుందనేది ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.
స్థానిక ఏరియాల్లోకి వెళ్తున్నామని, హెల్మెట్ ధరించకపోతే వచ్చే నష్టం ఏమిలేదనుకుంటే తప్పుచేసినట్టేనని సీఐ తెలిపారు. ఏ వాహనదారుడు ఎట్లా వస్తాడో గుర్తుపట్టడం చాలా కష్టమని, అందుకే హెల్మెట్ ధరించాలని సూచించారు.రామగుండం పోలీసు కమిషనరేేట్ పరిధిలో వాహనదారులకు ఎన్నో సదస్సులు నిర్వహించామని, ఇంకా చేపడుతామని సీఐ తెలిపారు.
ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని, ఇతరులకు ఆదర్శంగా నిలువాలని రమేశ్‌బాబు సూచించారు. ప్రధానంగా యువత ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా వాహనాలను వేగంగా నడుపుతూ.. విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని సీఐ రమేశ్‌బాబు తెలిపారు. విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా యువతను చైతన్యపరిచి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వుందని రమేశ్‌బాబు పేర్కొన్నారు. తప్పని సరిగా ప్రతి ఒక్కరు విధిగా టాఫ్రిక్ నియమాలను పాటించాలన్నారు.