Home తెలంగాణ విజయం సాధించే వరకు విశ్రమించవద్దు

విజయం సాధించే వరకు విశ్రమించవద్దు

3419
0
Ramagundam Constituency Meeting
Minister Koppula Easwar speaking at Peddapalli meeting

– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపు

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పెద్దపల్లి, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ జెండాను ఎత్తి ఉద్యమించి లక్ష్యాన్ని ఏ విధంగా ముద్దాడామో… అదే పంథాలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీ విజయాన్ని ముద్దాడే దాకా నిద్రపోవద్దని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌ లో రామగుండం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో జరిగిన రామగుండం నియోజకవర్గంలోని 259పోలింగ్‌ బూత్‌ కమిటీల బీఆర్‌ఎస్‌ పార్టీ కన్వీనర్‌, కో-కన్వీనర్‌, ఇంచార్జ్‌ ల ప్రత్యేక సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం అలసత్వం వహిస్తే అవాస్తవాలు, అబద్దాలు రాజ్యమేలుతాయనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఈ విషయంలో ప్రతీ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త ఒక సుక్షితుడైన సైనికుడిలా పనిచేయాలన్నారు. ప్రతిపక్షాల ప్రచారం చేస్తున్న అసత్యాలపై చర్చ పెట్టి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు బీజేపీ 8ఏళ్ల పాలనంత దరిద్రమైన పాలన చరిత్రలోనే లేదన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్‌ పాలన, నేటి బీజేపీ పాలనలపై చర్చపెట్టి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను కార్యకర్తలు చెడుగుడు ఆడాలన్నారు.

Ramagundam Constituency Meeting
Minister Koppula Easwar speaking at Convenor, Coconvers meeting

రామగుండం నియోజకవర్గంలోని 259పోలింగ్‌ బూతుల్లో బూత్‌ ఇంచార్జిల నియామకం చేసుకొని, తొలుతగా బూత్‌ కమిటీలను నిర్మించుకోవడం శుభ సూచకమన్నారు. ఇదే విధానాన్ని అన్ని నియోజక వర్గాల్లో అమలు చేస్తామన్నారు. ఈ రోజు నుంచి రానున్న ఎన్నికల యుద్ధం ముగిసే వరకు
అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకూ పనిచేద్దామన్నారు. నిస్వార్ధంగా పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకరకర్తలు, నీతి నిజాయతీలతో ఉండటంవల్లే బీఆర్‌ఎస్‌ పార్టీ పది కాలాల పాటు పనిచేస్తున్న దన్నారు. పార్టీకి కార్యకర్తలే పునాధిరాళ్ళని, సుశిక్షితులైన నాయకుల పనితీరు, నాయకత్వంపై నమ్మకం కారణంగానే బీఆర్‌ఎస్‌ పార్టీ బలమైన పార్టీగా అవతరించిందన్నారు.

బూత్‌ కమిటీల నిర్మాణంతో జరిగే పనిని ప్రారంభించాలని, ఇంకా ఎన్నికలకు 6నెలల సమయం మాత్రమే ఉందన్నారు. ఈ పని మొదలు పెట్టి, పూర్తి చేసేలోగానే ఎన్నికలు వస్తాయన్నారు. సమయం లేదు మిత్రమా! పార్టీ పని కోసం సిద్దపడాలన్నారు. మునుపటి పరిస్థితులు లేవని, ఎవరి చేతిలో ఎవరూ లేరని, ప్రతీ ఒక్క ఓటరును కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. పార్టీ పటిష్టత కోసం ముందుకు సాగుతున్న క్రమంలో అవాంతరాలు, అడ్డంకులు వస్తాయని, వాటిని తట్టుకొని ఒక శపథం చేసుకొని ముందుకు సాగాలన్నారు.

కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొట్టి విజయాన్ని ముద్దాడాలి…
–  ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌

Ramagundam Constituency Meeting
MLA Korukanti Chander speaking at Convenor, Coconvers meeting

రామగుండం నియోజకవర్గంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, ఎంత మంది ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాటిని తిప్పి కొట్టి విజయాన్ని ముద్దాడే విధంగా ముందుండి పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే బిఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్‌ పోలింగ్‌ బూత్‌ కన్వీనర్‌, కో-కన్వీనర్‌, ఇంచార్జిలకు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతీ వెయ్యి మంది ఓటర్లకు ఒక బూత్‌ కమిటీ కన్వీనర్‌, కో-కన్వీనర్‌, ఇంచార్జిలను నియమించామని వారంతా తమ పరిధి లోని వెయ్యి మంది ఓటర్లను, వంద మందికి ఒక టీంగా తయారు చేసి, ఆయా టీంలకు ఉత్సాహవంతు లైన బీఆర్‌ఎస్‌ పార్టీ సుశిక్షితులైన సైనికులను నియమించుకోవాలన్నారు. అలా నిర్మించుకున్న ఆయా టీంలకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న, చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని కళ్ల ముందుంచాలన్నారు.

Ramagundam Constituency Meeting
Ramagundam MLA Korukanti Chander speaking at Convenor, Coconvers meeting

ఆయా ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు తమ దృష్టికి తీసుకురావా లన్నారు. వచ్చే నెల మార్చి 5న తిరిగి సమావేశాన్ని నిర్వహించుకుందామని, ఆలోగా వంద మందికి ఒకరి చొప్పున నియమించుకోవాలన్నారు. పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకం, విశ్వాసంతో మీపై పెట్టిన బాధ్యతలను ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుండి పార్టీ కోసం పనిచేయాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో మొత్తంగా 2 లక్షల 40వేల మంది ఓటర్లున్నారని, ప్రతీ వెయ్యి మందికి ఒకరి చొప్పున 259మందిని నియమించుకోగా, ప్రతీ 100మందికి ఒకరిని నియమించుకున్న తర్వాత ఆ ప్రాంత సర్పంచ్‌, ఎంపీటీసీ, కార్పోరేటర్‌, కౌన్సిలర్లతో కలిసి పార్టీ పటిష్టానికి కృషి చేయాలన్నారు. ఈ సంస్థాగత నిర్మాణం జిల్లాలో తొలుత రామగుండం నుంచి మొదలయ్యిందని, రాబోయే రోజుల్లో జిల్లాలోని మిగతా పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోనూ నిర్మించుకుంటామన్నారు. గులాబీ సైన్యం గెలుపును ముద్దాడే వరకూ విశ్రమించవద్దని మరోమారు పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధిని వివరించాలి…
– జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

Ramagundam Constituency Meeting
Peddapalli ZP Chairman Putta Madhu speaking at Convenor, Coconvers meeting

ఎన్నికలు వస్తున్నాయని ఎవ్వరూ ఆగమాగం కావద్దని, అనవసర విషయాలను ప్రక్కన పెట్టి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీలోని చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకొని, వాటిపైనే ఆలోచించి సమయాన్ని వృధా చేయవద్దని, మన కోసం పార్టీ చేసిన, రామగుండం ఎమ్మల్యే చందర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే చారిత్రాత్మక అభివృద్ధి జరిగిందన్నారు. ‘ఏదీ రామగుండం మెడికల్‌ కళాశాల ఎక్కడ..’అని రామగుండంలో ఆందోళనలు చేశారని, వారు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని, ఈ విషయాలన్నింటిపైనా సమగ్రంగా ప్రజలకు వివరించాలన్నారు.

అనంతరం కార్యకర్తలకు ఐడి కార్డులను ప్రధానం చేశారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అకాల మృతి చెందిన బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాలకుర్తి మండలం ఎలుకలపల్లికి చెందిన తుంగపిండి కనుకయ్య, అంతర్గం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ నజీర్‌ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, అంతర్గాం జెడ్పిటిసి అముల నారాయణ, పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయా రెడ్డి, రామగుండం నగర మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, మల్లావజ్జుల విజయానంద్‌ తో పాటు రామగుండం నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here