Home అంతర్జాతీయం ఇథియోపియా ప్రధానికి 2019 నోబెల్ శాంతి బ‌హుమ‌తి

ఇథియోపియా ప్రధానికి 2019 నోబెల్ శాంతి బ‌హుమ‌తి

617
0
Nobel prize 2019

ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్‌ అలీకి(43) అరుదైన గౌరవం దక్కింది. 2019 నోబెల్ శాంతి బ‌హుమ‌తిని అలీ గెలుచుకున్నారు. స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌లో ఇవాళ నోబెల్ క‌మిటీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. శాంతి స్థాప‌న కోసం, అంత‌ర్జాతీయ స‌హ‌కారం కోసం ఆయ‌న చేసిన కృషిని నోబెల్ క‌మిటీ గుర్తించింది. తమ పక్క దేశమైన ఎరిత్రియాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌ధాని అహ్మాద్ అలీ విశేషంగా కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ట్వీట్‌లో తెలిపింది. డిసెంబర్‌ 10న జరిగే కార్యక్రమంలో అలీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు.

ఏప్రిల్ 2018లో అలీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ వెంట‌నే ఆయ‌న ఎరిత్రియాతో శాంతి చ‌ర్చ‌ల‌కు పునాది వేశారు. గ‌త ఏడాది జూలై, సెప్టెంబ‌ర్ల‌లో జ‌రిగిన భేటీల్లో ఎరిత్రియా అధ్య‌క్షుడు అవెరికితో ఆయ‌న కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే అంత‌ర్జాతీయ బౌండ‌రీ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అబే అంగీక‌రించారు. శాంతి ఒప్పందం ద్వారా ఇథియోపియా, ఎరిత్రియా దేశ ప్ర‌జ‌ల్లో పాజిటివ్ మార్పును తీసుకువ‌స్తుంద‌ని నోబెల్ క‌మిటీ అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

అబీ అహ్మద్ అలీ పేదరికంలో పుట్టినా ఉన్నత సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. కటిక నేలపై నిద్రించే స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగాడు. అత్యవసర పరిస్థితి లో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడు. యుద్ధం వద్దు.. స్నేహం ముద్దు అంటూ దశాబ్దాల నాటి వివాదాన్ని పరిష్కరించి పొరుగుదేశంతో మైత్రిని సాధించిన ఘనుడు.

పేద కుటుంబంలో పుట్టినా సరే

అహ్మద్ అలీ అత్యంత పేద కుటుంబంలో జన్మించారు. కరెంట్, తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేని ఇంట్లో కటిక నేలపై పెరిగారు. అయితే చిన్నప్పటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న అబీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాన్ని మాత్రం వదిలి పెట్టలేదు. టెక్నాలజీపై ఇష్టంతో యువకుడిగా ఉన్నప్పుడే సైన్యంలో రేడియో ఆపరేటర్ గా చేరారు. అక్కడ పనిచేస్తూనే కంప్యూటర్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పొందారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు. శాంతి భద్రతల అంశంలో పీహెచ్ డీ పూర్తిచేశారు. సైన్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు.

రాజకీయాలపై ఆసక్తితో 2010లో సైన్యంలో ఉద్యోగం వదిలి ఒరోమో డెమోక్రటిక్ పార్టీ(ఓడీపీ)లో చేరారు. ప్రజలకు చేరువగా ఉంటూ అనతికాలంలోనే రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి తెచ్చుకున్నారు. 2018 ఏప్రిల్ 2న ఇథియోపియా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఒరోమోగా అరుదైన ఘనత సాధించారు.

వైరం వదిలి స్నేహ హస్తం

ఇథియోపియాకు పొరుగున ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే అహ్మద్ అలీ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఎరిట్రియా అధ్యక్షుడు అవెర్కీతో అనేక మార్లు చర్చలు జరిపి స్నేహ హస్తాన్ని చాచారు.  మూడు నెలల్లోనే ఎరిట్రియాతో వివాదాన్ని పరిష్కరించుకుని యుద్ధానికి ముగింపు పలికారు.

యుద్ధం ఎందుకు..?

ఒకప్పుడు ఇథియోపియాలో భాగమైన ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం తర్వాత 1993లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అయితే కొంతకాలానికే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. బాద్మీ పట్టణం సహా పలు సరిహద్దు ప్రాంతాల విషయంలో 1998 నుంచి 2000 మధ్య రెండేళ్ల పాటు ఇరు దేశాలు భీకర యుద్ధం సాగించాయి. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సమస్య పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో బాద్మీ పట్టణాన్ని ఎరిట్రియాకు ఇచ్చేలా 2002లో అప్పటి ఎరిట్రియా-ఇథియోపియా బార్డర్ కమిషన్ ఆదేశించింది. అయితే ఇందుకు ఇథియోపియా అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అహ్మద్ అలీ ఎంతో కృషి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎరిట్రియా అధ్యక్షుడు అవెర్కీతో ఈ విషయంపై చర్చలు జరిపారు. బార్డర్ కమిషన్ ఆదేశాలను అమలు చేస్తామని అవెర్కీని ప్రతిపాదించారు. బాద్మీ పట్టణాన్ని ఎరిట్రియాకు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు ఎరిట్రియా అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించారు. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఇథియోపియా-ఎరిట్రియా మధ్య యుద్ధం ముగిసినట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.

Border issue

అలీ అధికారంలోకి వచ్చే నాటికి దేశంలో అత్యయిక పరిస్థితి నెలకొని ఉండగా.. రెండు నెలల్లోనే ఆ స్థితిని ఎత్తివేశారు. ఆర్థికంగా, రాజ్యాంగ పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. జైళ్లలో మగ్గుతున్న రాజకీయ నేరస్థులకు విముక్తి కల్పించారు. అనేక రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. అవినీతికి పాల్పడిన మిలిటరీ, పౌర అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించారు. రాజకీయాలు, ఇతర రంగాల్లో మహిళల పాత్రను పెంచేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగానే తన మంత్రివర్గంలో సగం మంది మహిళా మంత్రులను చేర్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here