కరోనా వైరస్ నివారణ కొరకు జిల్లా యంత్రాంగం, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ మరియు పారిశుద్ద్య కార్మికులు అహర్నిషలు శ్రమిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికి కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియా, పత్రికలు మరియు ఇతర ప్రసార మాధ్యమాలలో సన్నద్దతపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే గాకుండా డాక్టర్లు మరియు నర్సుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో కరోనా నివారణకు ప్రభుత్వపరంగా జిల్లా యంత్రాంగం, పోలీసులు, వైద్య బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ 24 గంటలు వైద్యసేవలు అందిస్తూ కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తు కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకొనుట జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఇప్పటికే కరోనా సోకిన పేషెంట్లకు పూర్తిస్థాయి చికిత్స అందించుటకు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల సౌకర్యాలతో 200 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని అందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలతో పాటు వారి పర్యవేక్షణకు వైద్యులు, నర్సులు మరియు ఇతర సిబ్బందిని నియమించుట జరిగిందని ఆయన అన్నారు. అలాగే కరోనా వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టితో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అంతేగాక ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వారి ఆదేశములు, సూచనలు పాటిస్తూ కోవిడ్-19 నివారణకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునుట జరుగుతుందని ఆయన తెలిపారు.
ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలో కరోనా నివారణకు ఉపయోగించే పి.పి.ఇ. కిట్లు-210, యన్-95 మాస్కులు 185, సర్జికల్ గ్లౌజులు 4500 అన్ని క్యాటగిరీలకు సంబంధించిన వైద్య సిబ్బందికి అవసరమైన 200 శానిటైజర్స్ 7900 వైద్య పరిక్షల సమయంలో వినియోగించే గ్లౌజులు, శానిటేషన్ మరియు సెక్యూరిటి సిబ్బందికి అవసరమైన 50 బాడీషూట్స్, శాంపిల్స్ సేకరించే 22 వి.టి.యంలు అందుబాటులో ఉన్నాయని, ఇంతేగాక జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో 200, పి.పి.ఇ.లు, 230, యన్, 95 మాస్కులు, 1000 సర్జికల్ గ్లౌజులు,. 4000 శానిటైజర్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అంతే గాక ముందు జాగ్రత్త చర్యగా అదనంగా, 500- పి.పి.ఇ కిట్లు- 500 యన్-95 మాస్కులు-, 1500, సర్జికల్ గ్లౌజులు, 100, శానిటైజర్స్- 200 బాడీ షూట్స్, 100 వీ.ఐ.ఎం.లు అదనంగా కొనుగోలు చేయుటకు తక్షణ చర్యలు తీసుకొన్నామని అన్నారు. వీటి వాడకం W H O మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఎన్ని ఏ విధంగా వాడాలో అదే విధంగా వీటి వాడకం జరుగుతుందని అన్నారు. హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్ల ఆరోగ్యం పట్ల ఏ విధమైన శ్రద్ద తీసుకుంటున్నామో అదే విధంగా డాక్టర్లు, నర్సుల ఆరోగ్యాలను కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉన్నందున వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకొనుట జరుగుతుందని ఆయన అన్నారు.
కావున జిల్లాలో కొందరు వ్యక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా సన్నద్దతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని, కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం అంతా సిద్దంగా ఉందని, అందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాబోవు 15 రోజులు చాలా ప్రమాదకరంగా ఉండనున్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్, కర్ఫ్యూకు సహకరించి ఇండ్లకే పరిమితమైనట్లుగానే మరో పదిహేను రోజులు ఇండ్ల నుండి బయటకు రాకుండా ఉండి కరోనా మహమ్మారిని పారద్రోలుటకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.