– ఎఐటియుసి శతజయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలి
– ‘సేవ్ సింగరేణి’ నినాదంతో ఎఐటియుసి ‘జాతా’
– ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుచేయనున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం ఆర్జీ-వన్ పరిధి జిడికె. 11వ గనిలో జరిగిన గేట్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు.
అక్టోబర్ 5 నుండి 19వ తేదీ వరకు ఎఐటియుసి ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి జాతాను గోలేటి నుండి మణుగూరు వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి కార్మికవర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ బడా కార్పోరెట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజికెయస్) గుర్తింపు సంఘంగా ఎన్నికైందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్ రద్దుచేస్తామని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. టిబిజికెయస్ నాయకులు పైరవీలకే పరిమితం అయినారని ఆరోపించారు. లాభాల వాటా ప్రకటించడంలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధికి కోట్లాది రూపాయలు ఇవ్వడం ఆక్షేపనీయమని అన్నారు.
రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసిని గెలిపించి మరిన్ని హక్కులు సాధించు కోవాలని ఆయన కార్మిక వర్గాన్ని కోరారు. ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆరెల్లి పోశం, బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడారు.
ఈ గేట్ మీటింగ్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, నగర కార్యదర్శి కె. కనకరాజ్, యూనియన్ నాయకులు మాదాన మహేష్, రంగు శీను, జిగురు రవి, గండి ప్రసాద్, చెప్యాల మహెందర్ రావు, యస్. వెంకటరెడ్డి, మిట్ట శంకర్, బోగ సతీష్ బాబు, పైడిపాల రాజయ్య, పర్లపెల్లి రామస్వామి, పి. నాగేంద్ర కుమార్, యం.సంపత్, జి. ప్రభుదాస్, బండి మల్లేష్, బలుసు రవి, డి.సాయన్న, కుక్కల శ్రీనివాస్, ఆరెల్లి రాజేశ్వరరావు, చెప్యాల భాస్కర్, బి. కనకయ్య, బుర్ర భాస్కర్, తాళ్లపల్లి మల్లయ్య, ఎర్రల రాజయ్య, పడాల కనకరాజ్, బూడిద మల్లేష్, టి. రమేష్ కుమార్, ఈర్ల రాంచంద్ర, రేణికుంట్ల ప్రీతం, తాళ్లపల్లి సురెందర్ తదితరులు పాల్గొన్నారు.