– రైతులకు వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించాలి..
– నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి..
– సన్నరకం వడ్లను కోనుగోలు చేయాలి
– అదనపు జిల్లా కలక్టర్ కు సీపీఐ వినతి పత్రం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 18ః అన్నం పెట్టే అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరిగోస పెడుతు న్నాయని, వారికి వెంటనే గిట్టుబాటు ధర, పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని సీపిఐ నేతలు డిమాండ్ చేసారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా లోని పలు గ్రామాల్లో సిపిఐ నేతలు సందర్శించిన అనంతరం అదనపు జిల్లా కలెక్టర్ వి.లక్ష్మినారాయణకు వినతి పత్రం సమర్పించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్, జిల్లా నాయకులు బాలసాని లేనిన్, ఈదునూరి ప్రేమ్ కుమార్ తదితరులు జిల్లాలోని పలు గ్రామాల ఐకెపి కేంద్రాలను సందర్శించి రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు
అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ అంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదని తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సూచనల మేరకు అధికారులు గ్రామ గ్రామాలు తిరుగుతూ నియంత్రిత పద్ధతిలో సన్నరకం వరిని సాగు చేయాలని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులతో సాగు చేయించడం జరిగిందని తెలిపారు. జిల్లా లో మొత్తం ఈ కరిఫ్ సిజన్ లో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల్లో సన్నరకం సాగు చేస్తే అరవై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారని పేర్కొన్నారు. దాదాపు డెబ్బై శాతం సన్నరకం సాగు చేసిన వారు సగానికి సగం నష్టపోయారు అని తెలిపారు.
జిల్లాలో దాదాపు ధాన్యం కొనుగోలు 302 కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఇందులో 267 కేంద్రాలు ప్రారంభించారని పేర్కొన్నారు. 20 రోజుల క్రిందటే వరికోతలు కోసిన సన్నారకం ధాన్యాన్ని కొనుగోలు మాత్రం చేయడం లేదు ఆవేదన వ్యక్తం చేసారు. అనేక సాకులతో రైతులను ఇబ్బందులు పెడుతు న్నారని ఆరోపించారు. ఇప్పటికే సన్నరకం సాగు చేసినందుకు రైతులు అనేక రకాలుగా అవస్ధలు పడి అప్పులు చేసి పెట్టుబడి పెడితే దిగుబడి లేక నష్ట పోయిన రైతాంగానికి అండగ ఉండాల్సిన ప్రభుత్వాలు అనేక సాకులతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బోనస్ ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాట ఎత్తడం లేదని విమర్శించారు. కేసిఆర్ రైతుల పట్ల ఎందుకింత వివక్షత అని ప్రశ్నించారు.
ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం సన్నరకం వరి సాగుచేయడంతో మూడు వేల కోట్ల దిగుబడి రైతాంగం నష్ట పోయిందని తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ పై నెట్టుతూ రైతాంగాన్ని అనేక ఆంక్షలుకు గురిచేస్తున్నారని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, రైతులకు న్యాయం జరిగేవరకు సీపీఐ పక్షాన నిరంతరం పోరాటాలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. యుద్ద ప్రాతిపాదికన నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, అదే విధంగా గిట్టుబాటు ధర 25000 రూపాయలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.