– పోలీసుల సేవలతోనే శాంతి
– పోలీసు అమరుల త్యాగాలు వృధాకావు
– రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 21: పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు వారి వ్యక్తిగత స్వేచ్ఛను త్యజించి, సమాజానికి అసాధారణమైన సేవలంది స్తుండటం వల్లనే నేడు సమాజం శాంతియుతంగా వర్ధిల్లుతోందని చెప్పారు.
బుధవారంనాడు కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో పోలీస్ ఫ్లాగ్‌డే (పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) సందర్భంగా స్మృతి పరేడ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రతపట్ల భరోసా కల్పిస్తూ భాద్యతాయుతంగా విధులను నిర్వర్తిస్తుండటం వల్లనే సమాజంలో శాంతియుతవాతావరణం నెలకుని అభి వృద్దిలో శరవేగంతో ముందుకు సాగుతున్నామన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు శాంతిభద్రత విధులకు పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాల నిర్వాహణతో రాష్ట్రానికే స్తూర్తిగా నిలుస్తున్నారని అభినందించారు. హరితహారం, మియావాకి పద్దతిలో చిట్టడవుల పెంపకాన్ని అధ్యయనం చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇదేపద్దతిలో వనాల పెంపకంకోసం యాదాద్రి మోడల్‌ఫారెస్ట్‌ను అమలుచేస్తున్నదని చెప్పారు.
గతనాలుగు సంవత్సరాలకాలం నుండి కరీంనగర్ పోలీసులు సమాజానికి అందిస్తున్న సేవలు అసాధారమైనవని పేర్కొన్నారు. శాంతిస్థాపన కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలు వృధాకావని, అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.
లేక్‌పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటుతో ఊహించని విధంగా పర్యాటక ప్రాంతాలైన మానేరు జలాశయం, జింకలపార్కు, ఉజ్వలపార్కు ప్రాంతాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడం లేదని, సిసి కెమెరాల ఏర్పాటుతో చేధించబడుతున్న వివిధ రకాల నేరసంఘటనలతో టెక్నాలజీ వినియోగంలో తమ సమర్ధతను చాటుకుంటున్నారని తెలిపారు.
పోలీసు అమరవీరుల సంక్షేమకోసం అమలుచేయాల్సిఉన్న మరిన్ని పథకాలు/సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేనెలలో కరోనా కేసులు దేశాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు ఒకటీంలా ఏర్పడి నియంత్రించడంలో సఫలీకృతు లయ్యారని అభినందించారు.
జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్దిసాధ్య మవుతుందని, అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. పోలీసు అమరవీరుల త్యాగాలు అమూల్యమైనవని పేర్కొన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు వృధాకావని,వారి ఆశయాల సాధనకోసం శక్తివంచనలేకుండా కృషిచేస్తామన్నారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 264మంది పోలీసులు నక్సలైట్లు/ఉగ్రవాదుల హింసాత్మక చర్యల్లో ప్రాణాలను కోల్పోయారని, 1985నుండి ఇప్పటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 47మంది పోలీసులు శాంతిస్థాపనకోసం వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని చెప్పారు. పోలీసు వృత్తి ప్రతినిత్యం సవాళ్ళతో కూడుకున్నదని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా అలవొకగా ఎదుర్కొని శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్ళు శ్రమిస్తామని తెలిపారు.
కమిషనరేట్ పోలీసులు టెక్నాలజీ వినియోగంతో ముందుకుసాగుతున్నారని, ప్రజలు అందిస్తున్న సహకారంతో ఇప్పటి వరకు ప్రజల రక్షణ,భద్రతవిషయంలో దేశంలో నాల్గవస్థానం, సత్వరం స్పందిస్తూ ప్రజలకు వేగవంతగా సేవలందించడంతో చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశవ్యాప్తంగా 08వ ఉత్తమంగా నిలువడంతోపాటుగా తాజాగా కోవిడ్ నియంత్రణ చర్యల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో రాష్ట్రంలో రెండవస్థానంలో నిలిచిందని వివరించారు. గత నాలుగు సంవత్సరాల కాలంనుండి పోలీస్‌శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం వీరమరణం పొందిన 264మంది పోలీసుల పేర్లను అడిషనల్ డిసిపి(పరిపాలన) జి చంద్రమోహన్ చదివి వినిపించారు. స్మృతి పరేడ్ సందర్భంగా పోలీసులు శోక్‌శస్త్ర్ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిధితు అమరవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి లాంచనాలతో నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, నగర మేయర్ వై సునీల్‌రావు, సుడా ఛైర్మెన్ రామకృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ వి క్రాంతి, అడిషనల్ డిసిపి(ఎల్‌అండ్‌ఓ) ఎస్ శ్రీనివాస్, ట్రైనీ ఐఏఎస్ అధికారి అంకిత్, ఐపిఎస్ అధికారిణి సాధన రష్మి పెరుమాళ్, ఏసిపి అశోక్, ఎస్‌బిఐ ఇంద్రసేనారెడ్డి, పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం సురేందర్, కార్యదర్శి తుల శ్రీనివాసరావులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, శాంతి,సంక్షేమ కమిటి సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలీసు అమరవీరులకు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నివాళి
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ బుధవారంనాడు కమిషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఈ మధ్యకాలంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్నాజియం, నిజాంకాలంనాటి గోల్‌బంగ్లాను ఆధుకరించి ఏర్పాటు చేసిన లాంజ్‌ను పరిశీలించారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలతో కమిషనర్ సమావేశం
కార్యక్రమం అనంతరం పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి పోలీసు అమరవీరుల కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు అమర వీరుల కుటుంబాలు తమకున్న సమస్యలను దృష్టికి తీసుకవచ్చినట్లైతే పరిష్కరిస్తా మన్నారు. అమరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి(పరిపాలన) జి చంద్రమోహన్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి సాధన రష్మీ పెరుమాళ్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.