– ఎమ్మెల్యే కోరుకంటి చందర్
మానవాళి కోసం ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక సిఎస్‌ఐ సెయింట్ పాల్ చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మానవాళి కోసం శిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు, చనిపోయిన మూడో రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెపుతోందని ఆయన అన్నారు. క్రీస్తు పుట్టిన రోజయిన క్రిస్మస్ తరువాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉందన్నారు. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తోందని, ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయని అన్నారు. ఈ నలభై రోజులు క్రిస్టియన్లు ఉపవాసం ఉండి, పొదుపు చేసిన ఆహార పదార్ధాలు, నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా దానమిస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్టియన్లకు ప్రాధాన్యతనిస్తూ, క్రిస్మస్ రోజున పేదలకు క్రిస్మస్ కానుకలను అందజేస్తున్నారని అన్నారు. పవిత్ర బైబిల్‌లోని వాక్యాలు ప్రజలు పరిశుద్ధులుగా జీవించడానికి ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరు ఈ వాక్యాలను అనుసరిస్తే ఉత్తమమైన జీవితం పొందవచ్చు నన్నారు. ఇతరులకు హాని చేయకుండా, సహాయ గుణమును అలవర్చుకోవాలని.. అప్పుడే దేవుని కృపకు పాత్రులమవు తామన్నారు. దేవుడి అనుగ్రహంతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని… దేవుడు చూపిన బాటలోనే సంక్షేమం కోసం పయనిస్తున్నానని ఆయన అన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు సహాయ-సహకారాలు అందజేస్తూ, వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు హామీచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని, రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈస్టర్ ను పురస్కరించుకుని ఎమ్మెల్యే చందర్ క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ లక్ష్మణ్ జాకబ్, కమిటీ సభ్యులు దయానంద్ గాంధీ, జయరాజు, సునీల్, కెనడి, సురంజన్ తదితరులు పాల్గొన్నారు.