పూల మాల వేసి నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 27: కరీంనగర్ కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపుజీ 105 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపుజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27 న జన్మించాడని తెలిఆపారు. స్వాతంత్ర్యోద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని ఆయన అన్నారు. తెలంగాణ తొలితరం పోరాటయోధుడని, ఆఖరి శ్వాస వరకు తెలంగాణకై పారాడిన కొండా లక్షణ్ బాపూజీ స్మరించుకోవడమంటే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడేనని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్ప నాయకులను, గొప్ప వ్యక్తులను వారి త్యాగాలను స్మరించుకోవాలని, వారి జయంతీలను జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా, దిగువ కులాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్, విద్యను కల్పించి అండగా ఉన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. మంత్రి పదవిని వదులుకొని తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అని, స్వాతంత్ర్య ఉద్యమంలో తెలంగాణ విమోచన చేనేత రంగంలో ఆయన పాల్గొనడం జరిగిందని కలెక్టర్ అన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు అనంతరం ఉద్యానవన విశ్వవిద్యాలయాని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి ఆయనను గౌరవించడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా కొండా లక్ష్మణ్ బాపుజీ గొప్పతనాన్ని, సేవలను నెమరు వేసుకోవడానికి అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, డి.ఆర్.వో. వెంకట మాధవ రావు, ఆర్.డి.వో. అనంద్ కుమార్, వ్యవసాయాధికారి శ్రీధర్, మెప్మా పిడి రవీందర్, సంబంధిత అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.