(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 17: నిండుకుండలా వున్న గోదావరి నీరు కలుషితం కాకుండా ఉండేందుకు, అదే క్రమంలో బతుకమ్మను నిమజ్జనం చేయడానికి ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేసే నిమిత్తం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్థలాలను అన్వేషించారు. అందులో భాగంగానే శనివారం సాయంత్రం సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల ఏర్పాటుకు స్థలం అనుకూలంగా వుందని పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరి నదికి జలకళ తీసుకురావటం జరిగిందని, గోదావరి కలుషితం కాకుండా స్వచ్ఛతను కాపాడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నది నీరు రైతులకు సాగు నీరు అందించ డంతో పాటు ఈ ప్రాంతంలో త్రాగు నీరుకు ఉపయోగించడం జరుగుతుందన్నారు.
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు గోదావరి స్వచ్ఛతను కాపాడేందుకు ప్రత్యేకంగా బతుకమ్మ నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గోదావరినదిలో బతుకమ్మలు, గణేష్ నిమజ్జనాల మూలంగా కలుషితం అయ్యే అవకాశం ఉందని నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా ఘాట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. సింగరేణి సీఎండిని గోదావరి నది తీరంలో బతుకమ్మ, నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేయాలని కోరుతామని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రజలు ఈ ఘాట్లను సద్వీనియోగం చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అబిషేక్ రావు, జీఎం నారాయణ, కమీషనర్ ఉదయ్ కుమార్, కార్పోరేటర్లు దాతు శ్రీనివాస్, కన్నూరి సతీష్ కుమార్, నాయకులు పాతి పెళ్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, చెలుకలపెల్లి శ్రీనివాస్, అధికారులున్నారు.