– భూవివాదాలకు శాశ్వత పరిష్కారం…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 7: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలను శాశ్వతంగా తొలగించి, యాజమాన్యహక్కును కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్మాకమైన నిర్ణయం తీసుకుని నూతన రెవెన్యూ చట్టం అమలు చేయడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం సాయంత్రం రామగుండం కార్పోరేషన్ కార్యాలయంలో ధరణి సర్వే సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టం ద్వారా భూవివాదాలకు తావు లేకుండా గొప్ప అవకాశం కల్పించిందన్నారు. ఈ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు. ధరణి సర్వే సిబ్బంది అన్ని వివరాలు సేకరించి సంపూర్ణ నివేదికను అందించాలన్నారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలో 47వేల ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను గడువులోపు అందించాలన్నారు. ప్రజల సందేహాలను సర్వేకు వెళుతున్న సిబ్బంది నివృత్తి చేయాలని కోరారు. ధరణి సర్వే ప్రజలకు అర్ధం అయ్యేలా తెలిపి పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
ఈ సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్‌తో పాటు ధరణి సిబ్బంది పాల్గొన్నారు.