– రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
(పజ్రాలక్ష్యం పత్రినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 29: తెలంగాణలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కారించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాల కిషన్, మేయర్ సునిల్ రావు, సుడా చైర్మన్ జీ.వి. రామకష్ణా రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేలా, ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదన్నారు. ఆస్తుల నమోదుకు సంబంధించి దళారులను నమ్మొద్దని, ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని మంత్రి సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేవాదాయ, వక్ఫ్, పరిశ్రమలు తదితర భూముల్లో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మిగతా సమస్యలు పరిష్కారానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లోని రెవెన్యూ సంబంధిత సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణ మంత్రి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వార్డుల వారిగా పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
పట్టణాల్లో ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ హక్కు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నదని స్పష్టం చేశారు. ఏండ్లుగా నివాసముంటూ ప్రభుత్వానికి బిల్లులు చెల్లిస్తున్న పట్టణ పేదలకు ఆయా స్థలాలపై టైటిల్ హక్కులు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభమయిందన్నారు.
గ్రామాల కంటే పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తులకు సంబంధించి టైటిల్ సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్దఎత్తున ఉపశమనం కలిగించామని.. అయినప్పటికీ కొన్ని కారణాలతో పరిష్కారంకాని సమస్యలపై ప్రత్యేక దష్టి సారించామన్నారు.
మున్సిపాలిటీల్లోని పేదల కోసం ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయిలో, శాశ్వత పరిష్కారం చూపుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
వ్యవసాయేతర ఆస్తులను 15 రోజుల్లో ధరణి వెబ్‌సైట్‌లో నమోదుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. దసరా నుంచి ధరణి వెబ్‌పోర్టల్ ప్రారంభమవుతుందని, గుర్తించిన భూములన్నింటిని అదే రోజు ధరణి వెన్ సైట్ లో అప్ లోడ్ చేసే విధంగా చూడాలని, ధరణి వెబ్ సైట్ ఏర్పాటుకు సంబంధించి సౌకర్యాలు కల్పించుటకు ప్రతి తహశీల్దార్ కార్యాలయాలకు పది లక్షల చొప్పున నిధులు సమకూర్చడం జరుగుతుందని ఆయన అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ అర్బన్ ఏరియాలో నిరుపేదలకు యజ మాన్యపు హక్కులను కల్పించాలని, ఇండ్లు మరియు స్థలాల ఎల్.ఆర్.ఎస్. సర్వే నెంబర్ల వారిగా సేకరించి ఎల్.ఆర్.ఎస్. కు ప్రతి ఒక్క ఇంచు భూమిని ధరణి కోటలో ఎక్కే విధంగా రికార్డులు సిద్ధం చేయాలని రెవెన్యూ వారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అంకిత్, ఆర్‌డివోలు, తహశీల్దార్లు, డిప్యూటి మేయర్ స్వరూపా రాణి, కొత్తపల్లి చైర్ పర్సన్ రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.