– పెద్ద సంఖ్యలో హాజరుకానున్న మంత్రులు…ఎమ్మెల్యేలు…
– ‘మెగాస్టార్’ చిరంజీవి…
– ఆలయ ఫౌండేష వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి…
(ప్రజాలక్ష్యం ప్రతనిధి)
గోదావరిఖని ఏప్రిల్, 8: ఈ నెల 10న ‘శంకర్’ విజన్ సెంటర్ ప్రారంభించనున్నామని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ విభాగానికి ప్రిన్సిపల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్న పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ మేరకు శనివారం గోదావరిఖని రెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరహరి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధి బసంత్‌నగర్‌లో ‘దివంగత పరికిపండ్ల సత్యనారాయణ’ స్మారకార్ధం ‘శంకర్ విజన్ సెంటర్’ నిర్మాణం జరిగిం దన్నారు. ఈ సెంటర్‌ను ప్రారంభించడానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌లు, జడ్పీ చైర్మన్ హాజరవుతున్నారని నరహరి పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తన తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణార్థం శంకర్ విజన్ సెంటర్ అతిథుల చేతులమీదుగా ప్రారంభిస్తారని నరహరి తెలిపారు.
సామాన్య కుటుంబంలో జన్మించానని… తన తండ్రి సత్యనారాయణ ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించా రన్నారు.ఆయన ప్రోద్బలంతోనే ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నానని నరహరి పేర్కొన్నారు. పుట్టిన గడ్డకు..ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైన చేయాలనే సంకల్పంతో శంకర్ విజన్ సెంటర్‌ను బసంత్‌నగర్‌లో నెలకొల్పామన్నారు.ఈ సెంటర్ ద్వారా ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నామని నరహరి తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు అండగా… తోడుగా నిలబడనున్నామని పరికింపడ్ల నరహరి అన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద ప్రజలతోపాటు సమీపంలోని ఆదిలాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, మంథని ప్రాంతీయ భేద భావం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. అత్యధిక టెక్నాలజీతో శంకర్ విజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు.సేవ దృక్పథం కలిగిన వైద్య బృందం పరీక్షల నిర్వహిస్తారని, ప్రతిరోజు సుమారు 50 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని, భవిష్యత్తులో రోగుల సంఖ్యను ఆధారంగా కంటి వైద్య సేవలు విస్తృత పరుస్తామన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని నరహరి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. సినీ జానపద గాయని మంగ్లీ, గేయ రచయిత కాసర్ల శ్యామ్, సినీ నటులు ప్రియదర్శి, వేణుచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విలేకరుల సమావేశంలో ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు కుమార్, రమేష్‌బాబు, అయిత శివ, రాజేందర్, కృష్ణమూర్తి, రామన్న, రామస్వామి, నాగార్జున, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.