(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జగిత్యాల, సెప్టెంబర్ 5: సిబ్బంది వారి విధులను కష్టంగా కాకుండా ఇష్టంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది వారివారి విధులను కష్టంగా కాకుండా ఇష్టంగా భావించి విధులు నిర్వర్తించాలని, అప్పుడే వారి బాద్యతలను నూరుశాతం నిర్వహించగలుగుతారని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే జరగాలని, పరిపాలన సౌలభ్యం కొరకు ఈ- ఆఫీస్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, తద్వారా ఫైల్ యొక్క ప్రగతిని తెలుసుకోవడంతో పాటు అతితక్కువ సమయంలో సమస్యలను పరిష్కరించగలుగుతామని పేర్కొన్నారు. ధరఖాస్తులను స్వీకరించడంతో పాటు దానిని ఆన్ లైన్ ద్వారా అధికారులకు పంపించాలని సూచించారు. పరిశీలకులు వారు స్వీకరించే ప్రతి ధరఖాస్తు ప్రగతిని తెలుసు కోవడంతో పాటు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఆన్ లైన్ పై అవగాహన లేనివారు దాని గురించి తెలుసుకోవాలని సూచించారు. 15రోజులలోగా కార్యాలయంలో ఉన్న పెండింగ్ ధరఖాస్తులను పూర్తిచేయడానికి కృషిచేయాలన్నారు. అవసరమైతే ఉదయం, సాయంత్రం ఎక్కువ పనిచేయాలని తెలిపారు. ప్రతిఒక్కరికి వారివద్ద పెండింగ్ లో ఉన్న ధరఖాస్తుల వివరాలను సంబందిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టం బి.రాజేశం, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడిస్ అరుణశ్రీ, కలెక్టర్ కార్యాలయ ఏఓ సి.హెచ్. శ్రీనివాస్ పాల్కొన్నారు.