(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 21: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాల నియంత్రణపై పోలీసులు దూకుడు పెంచారు. పోలీసుల దాడులు సోమవారం కూడా కొనసాగాయి. చిన్నచిన్న సమాచారాలాను ఆధారం చేసుకుని వాటికి మూలాధారాలను అన్వేషిస్తూ దాడులను కొనసాగిస్తున్నారు.
నిషేదిత పొగాకు ఉత్పత్తుల స్వాధీనం
కేశవపట్నం పోలీసులు కన్నారం గ్రామంలోని ఒకకిరాణం దుకాణంపై దాడి నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా గంగాధరకు వెళ్ళి సోదాలు నిర్వహించగా భారీమొత్తంలో నిషేదిత పొగాకు ఉత్పత్తుల నిల్వలు లభించాయి. రెండు ప్రదేశాల్లో పోలీసులు 1,01,250రూపాయల విలువచేసే నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులపై కేసునమోదు చేశారు.
అలాగే తాడికల్ గ్రామంలో దాడి నిర్వహించి 18,750రూపాయల విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి పోలీసులు బావుపేటలో 2,923 రూపాయలు, కొత్తపల్లిలో 1,983రూపాయల విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులు శ్రీపుర చంద్రశేఖర్, కేశ రమేష్‌లపై కేసులను నమోదు చేశారు.
పేకాటరాళ్ళ పట్టివేత
చొప్పదండి మండలంలోని వెదురుగట్ట గ్రామశివారులో మూడుపత్తాల ఆట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా 3,190 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు ముకరంపుర ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిపై కేసునమోదు చేశారు. వీరివద్దనుండి 3610రూపాయలన నగదును స్వాధీనం చేసుకున్నారు.
పిడిఎస్ బియ్యం పట్టివేత
కరీంనగర్‌లోని శర్మనగర్ ప్రాంతంలో స్పెషల్‌బ్రాంచి హెడ్‌కానిస్టేబుల్ రాంమ్మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు నిల్వఉంచిన ఆరు క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని పట్టుకుని టూటౌన్ పోలీసులకు అప్పగించారు. దీని విలువ 6వేల రూపాయలు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు కశ్మీర్‌గడ్డ ప్రాంతంలో నాలుగు క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, విక్రయదారుడు మహ్మద్ అమ్జద్‌పై కేసునమోదు చేశారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ల పట్టివేత
గంగాధర పోలీసులు అక్రమంగా ఇసుక అక్రమరవాణాకు పాల్పడుతున్న ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. చొప్పదండి పోలీసులు గర్రెపల్లి నుండి చొప్పదండికి అక్రమంగా తరలివస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.
నల్లబెల్లం, గుడుంబా పట్టివేత
కేశవపట్నం పోలీసులు రెండు ఆటోల్లో అక్రమంగా రవాణా అవుతున్న నల్లబెల్లంను వాహనాల తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. గంగాధర పోలీసులు రాయలపల్లి గ్రామంలో పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన విక్రయదారుడు అజ్మీరా రవినాయక్‌పై కేసునమోదు చేశారు.