– రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, ఏప్రిల్, 8: ప్రైవేటీకరణే బిజెపి ప్రభుత్వ విధానమని, ప్రధాని మోడి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా అమ్మేస్తూ, ప్రైవేటుపరం చేస్తూ అదాని, అంబానీలకు కట్టబెడుతున్నారని రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, రామగుండం ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ నేతృత్వంలో సింగరేణి బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన యుద్దభేరి ‘మహాధర్నా’లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలైన విమానయానం, నౌకాయానం, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా అమ్మి వేస్తోందన్నారు. బిజెపి పాలనలో దేశం నాశనమవుతోందని, అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులు లాభాల్లో నడుస్తున్నాయని, లాభాల్లో నుండి 30 శాతం లాభాల వాటాను కార్మికులకు పంచుతోందన్నారు. సంస్థలోని బ్లాకులు ప్రైవేటుపరమైతే కొత్త గనులులేక, కార్మికులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారని, రాబోయే రోజుల్లో బొగ్గుబ్లాకులు ప్రైవేటుపరమైతే తిరిగి వారసత్వ ఉద్యోగ అవకాశాలు రద్దు చేయబడతాయని, కార్మికులు వెట్టిచాకిరిలోకి నెట్టి వేయబడతారన్నారు. వారికి అందిస్తున్న క్వార్టర్ సౌకర్యం, ఉచిత విద్యుత్, వైద్యం, వారి పిల్లలకు ఉచిత విద్య వంటి సౌకర్యాలు రద్దు చేయబడతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్టీపీసీకి 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ వచ్చిందని, గనులు ప్రైవేటు పరమైతే దానికి అవసరమైన బొగ్గును ఎక్కడినుండి తెచ్చుకోవాలన్నారు. సింగరేణి బొగ్గు రూ.4వేల 5వందలకు టన్ను లభిస్తుంటే, ఇండోనేషియాలోని అదానీ గనుల నుండి బొగ్గును టన్నుకు రూ.24వేల 5వందల చొప్పున కొనాలని మోడీ ఒత్తిడి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమంటే పట్టించుకోలేదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తూ తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపారన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టులను తాము అధికారంలో ఉన్న మరో రాష్ట్రాలకు మంజూరు చేశారన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి దిక్కు లేదన్నారు. రాష్ట్రాల పట్ల తండ్రిలా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టాలను అమలు చేయకుండా, ప్రాజెక్టులు రాకుండా చేసి, మెడపై కత్తి పెట్టినట్టు పాలన సాగిస్తోందన్నారు. ఇన్నాళ్లు జరగని పేపర్ లీకేజీలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని, ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో అస్థిరతను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీని కాదని, నేడు ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు బ్లాకులను అప్పజెప్పాలని చూస్తే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు చూస్తూ ఊరుకోరన్నారు. రామగుండం వచ్చినప్పుడు బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పగించబోమన్న మోడీ, బెంగుళూరు వెళ్ళగానే మాటమార్చి టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పగించబోమని, బేషరతుగా సింగరేణికే అప్పగిస్తామని ప్రధాని మోడీ సుస్పష్టమైన హామీ ఇచ్చేవరకు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రజలు సమయం వచ్చినప్పుడు బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు.