– ‘డయల్ యువర్ కలెక్టర్’ లో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 21: ప్రజా సమస్యలను అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోను ద్వారా తెలుపు తారని అన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం లో జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన సమస్యలు ప్రజలు తెలిపినపుడు ప్రాధాన్యమిచ్చి వెంటనే నోటు చేసుకొని వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి వారికి లేఖ ద్వారా తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన పేదవారి నుండి తమకు డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని, తమ తమ మండలాల పరిధిలో ధరఖాస్తులు చేసుకోవాలని, వచ్చిన ధరఖాస్తులను అన్ని పరిశీలించి అధికారులు లబ్దిదారుల సమక్షంలో లాటరీ పద్దతిలో తీసి కేటాయిస్తారని వారికి తెలిపారు.
ఈ సందర్భంగా ఫోన్ ద్వారా నా భర్త గ్రామ పంచాయతిలో కారోబార్ గా పనిచేసి చని పోయారని, కానీ పెన్షన్ రావడం లేదని ఫిర్యాదు చేయగా, అదనపు కలెక్టర్ స్పందిస్తూ పెన్షన్ కొరకు వెంటనే ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సీయం సహాయనిధి కావాలని కోరగా, నేరుగా సీ.యం. సహాయనిధికి ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే విద్యానగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కావాలని ధరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన వెంటనే అందరి సమక్షంలో లాటరీ పద్దతిలో ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.
చొప్పదండి మున్సిపాలిటీ నుండి చంద్రకళ, నర్సవ్వ, లక్ష్మీనర్సయ్య, రమేష్ అనే వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్నారని, రామడుగుకు చెందిన చంద్రమోహన్ తన చెరువు ఆక్రమించుకున్నారని, తిమ్మాపూర్ లో పారిశుద్ద్య పనులు చేయడం లేదని, అలాగే రామడుగు గ్రామ పంచాయతిలో నిధులు దుర్వినియోగం అయినందున చర్యలు తీసుకోవాలని కోరగా అట్టివాటిపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు.
డయల్ యువర్ కలెక్టర్ లో భాగంగా వచ్చిన ఫిర్యాదులను వాటిని సంబంధిత శాఖలు వెంటవెంటనే పరిష్కరించాలి తప్ప క్రింది స్థాయి అధికారులకు ఎండార్స్ చేసి చేతులు దులుపుకోవద్దని వాటికి పరిష్కారమార్గం చూడాలని, పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలతో అర్జీదారులకు తెలపాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఏ. నరసింహా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతి అధికారి బుచ్చయ్య, ఎల్.డి.యం., జిల్లా సంక్షేమ అధికారి శారద, ఆర్డీఓ ఆనంద్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.