(ప్రజాలక్ష్యం ప్రతినిధి – కరీంనగర్)
కరీంనగర్, సెప్టెంబర్ 14: ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోను ద్వారా తెలుపుతారని అన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన సమస్యలు ప్రజలు తెలిపినపుడు ప్రాధాన్యమిచ్చి వెంటనే నోటు చేసుకొని వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి వారికి లేఖ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామం నుండి చంద్రయ్య ఫోన్ చేసి గ్రామంలో కొత్తగా 30 గృహాలు నిర్మించున్నారని, దానికి గ్రామ కార్యదర్శి అనుమతి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయగా, పరిశీలించిన వెంటనె పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామం నుండి రవి ఫోన్ చేసి 2016 సంవత్సరంలో సాదాబైనామాలు రిజిస్ట్రేషన్ కాలేదని ఫిర్యాదు చేయగా, మారుతున్న కాలాన్ని బట్టి కొత్త రూల్స్ వస్తున్నాయని అంతవరకు వేచి చూడాలని ఆయన అన్నారు.
కేశవపట్నం నుండి నజిరిన్ ఫోన్ చేసి పాస్ పుస్తకం రాలేదని ఫిర్యాదు చేయగా, ఎమ్మార్వోకు చెప్పి వెంటనే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. జమ్మికుంట మండలం కొత్తపల్లి నుండి కేదారేశ్వర్ ఫోన్ చేసి నా ఇల్లు రైల్వే స్టేషన్ కొరకు తొలగించారని వాటికి డబ్బులు, కొత్త ఇల్లుకోసం అనుమతి ఇప్పించాలని కోరగా, ఎల్ఆర్ఎస్ ఉంటే ఇంటి పర్మిషన్ ఇస్తామని సమస్య పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు.
డయల యువర్ కలెక్టరేట్ లో భాగంగా వచ్చిన ఫిర్యాదులు పోలిస్ కమిషనర్ 1, మున్సిపల్ కమిషనర్ కు 3, ఎన్ పిడిసిఎల్ కు 1, పంచాయతి అధికారులకు 7, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి 3, జిల్లా విద్యాధికారికి 5, సివిల్ సప్లైస్ అధికారులకు 4, ఆర్డీఓ కరీంనగర్ కు 2, కొత్తపల్లి తహశీల్దార్ కు 3, కరీంనగర్ రూరల్ తహశీల్దార్ కు 1, గన్నేరువరం తహశీల్దార్ కు 1, గంగాధర తహశిల్దార్ కు 2, మానకొండూర్ తహశిల్దార్ కు 1, శంకరపట్నం తహశిల్దార్ కు 1, ఆర్టీసి అధికారులకు 1, ఫిర్యాధులు రావడం జరిగింది. మొత్తం ఫిర్యాధులు 36 వచ్చినందున వాటిని సంబంధిత శాఖలు పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు, శ్యాం ప్రసాద్ లాల్, ఏ. నరసింహా రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతి అధికారి బుచ్చయ్య, జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి లక్ష్మారెడ్డి, కలెక్టరెట్ సూపరింటెండెంట్లు మాధవి, పారు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.