– నాణ్యత ప్రమాణాలలో రాజీపడేది లేదు:
– జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 7: రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు వేదికల భవనాల నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సైదాపూర్ మండలంలో నిర్మిస్తున్న అన్ని రైతు వేదికలను అక్టోబర్ 20 వ తేదీ నాటికి పూర్తి చేసెందుకు రాత్రి, పగలు పనులను చేపట్టవలసిందేనని జిల్లా కలెక్టర్ కె.శశాంక పంచాయితీ రాజ్ ఇంజనీర్లు మరియు గుత్తేదారులను ఆదేశించారు. బుధవారం సైదాపూర్ మండలంలోని ఆకునూరు, దుద్దెనపల్లి, గొడిశాల మరియు వెన్నంపల్లి గ్రామాలలో పర్యటించి రైతు వేదిక భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలలో ఏలాంటి రాజీపడేది లేదని మంచి నాణ్యతతో పకడ్బందీగా రైతు వేదికల నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ముందు గానే సిద్ధం చేసి రెండు షిప్టుల్లో పని చేయించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన కూలీలను సమకూర్చుకొని మండలంలో చేపట్టిన అన్ని రైతు వేదికల పనులను అక్టోబర్ 20 వ తేది లోపు పూర్తి చేసి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు.
నిర్ధేశించిన సమయానికి పనులన్ని పూర్తి చేయని పక్షంలో అధికారులు గాని, కాంట్రాక్టర్లు గాని ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. నిర్మాణ సందర్భంగా కొన్ని గ్రామాలలో నీటి సమస్య ఉన్నదని, కాంట్రాక్టర్ తెలుపగా అందుకు ఆయన స్పందిస్తూ వెంటనే సిమెంట్ వరలతో హౌజ్ లు నిర్మించి ట్యాంకుల ద్వారా నీరు నింపుకోవాలని, నిర్మాణాలు పూర్తి అయిన తదుపరి ఆయా హౌజ్ లను టాయిలెట్ల, ట్యాంకులకు ఉపయోగించాలని సూచించారు. అలాగే రైతు వేదికలకు అవసరమైన కరెంటు సౌకర్యం కొరకు ఒక లక్ష లోపు ఖర్చు అయ్యే లైన్లకు ఇప్పటికే నగదు మంజూరి చేశామని వాటి పనులు పరిశీలించి వెంటనే కనెక్షన్లు ఇచ్చే విధంగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడాలని హుజురాబాద్ ఆర్‌డివోకు సూచించారు.
అనంతరం దుద్దెనపెల్లి గ్రామంలో ఇండ్లు మరియు ఖాళీ స్థలాల, వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ నమొదు ప్రక్రియ విధానాన్ని పరిశీలించి సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. గ్రామాలలో సర్వే నిర్వహించేటప్పుడు ఏలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటు ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. నమోదు ప్రక్రియ ఈ నెల 12 వ తేదీతో ముగుస్తున్నందున సర్వేను వేగవంతం చేయాలని, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు సర్వే సందర్భంగా ఒక రోజు ముందుగా గ్రామస్తులకు తెలియజేసి అందరూ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోని సర్వే సిబ్బందికి సహకరించాలని ఆయన అన్నారు.
జిల్లాలో రాగల రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గ్రామాలలో రైతులకు అందుబాటులో ఉండి ఎలాంటి పంట నష్టం జరగకుండా తగు సూచనలు, సలహాలు అందించేందుకు తగు చర్యలు తీసుకొవాలని ఎం.పి.డి.వో. ను ఆదేశించారు.
కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ గ్రామంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండ్లు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను పరిశీలించి తగు సూచనలు చేస్తూ సర్వే ప్రక్రియ వేగవంతంగా నిర్వహించుటకు ప్రతి బిల్లు కలెక్టర్ కు లాగిన్ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో ఆయన వెంట హుజురాబాద్ ఆర్.డి.వో. పి.బెన్.షలోమ్, ఎమ్మార్వో , ఎంపిడివో పద్మావతి, పంచాయితీ రాజ్ శాఖ డిఈ ప్రకాష్ రావు, ఎంపిపి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ యుగంధర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.