– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 16: పంటను విక్రయించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్, పాలకుర్తి, కొత్తపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరిధాన్యం కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం ధాన్యం విక్రయాల్లో రైస్ మిల్లర్లు తాలు, మట్టి పేర దాన్యం నుండి మినహాయింపులు చేశారని ఈసారి అలా జరగకుండా దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద క్లినింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దనే రశీదు ఇవ్వడం జరుగుతుందని, రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే వెంట ప్యాక్స్ చైర్మెన్ మామిడాల ప్రభాకర్ ఉన్నారు.