– సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయండి…
– నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించండి…
– నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయండి…
– కమిషనర్‌కు సీపీఐ నాయకులు వినతి…
ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 15: రామగుండం కార్పోరేషన్‌లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ శ్రేణులు కోరారు. ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఉదయ్ కుమార్‌కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.
అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ సహాయ కార్యదర్శి మద్దెల దినేష్‌లు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఫైవ్‌ఇంక్లైన్ వరకు అర్‌అండ్‌బి మరియు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దాదాపు కోటి రూపాయల నిధులతో చేపడుతున్న ఫుట్ పాత్ నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాణ్యత లోపించి ఒక వైపు నిర్మిస్తా ఉంటే మరోవైపు కూలిపోతుందని ఆరోపించారు. నిర్మాణ పనులు సంబంధించిన ఆర్‌అండ్‌బి అధికారులుగాని నగర పాలక సంస్థ అధికారులు గానీ పర్యవేక్షించక పోవడం దురదష్టమని అన్నారు. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. సంబంధించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని కమీషనర్‌ను కోరినట్లు తెలిపారు.
రామగుండం పాత మున్సిపల్ కార్యాలయం కూల్చి వేసిన అనంతరం ఖాళీ స్థలంలో దాదాపు (సిఎంఏ) రూ.14 కోట్ల నిధులతో మినీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఏలాంటి పనులు జరగడం లేదని ఆరోపించారు. పనులు జరగకపోవడంతో స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పాత మున్సిపల్ కార్యాయలం ఆవరణ పార్కింగ్ స్థలంగా మారిందన్నారు. అదే విధంగా ఖాళీ స్థలంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని, మరో పోచమ్మ మైదానం కాకూడదని వినతిపత్రంలో కోరామన్నారు.
అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేద విద్యార్థులు మరియు నిరుద్యోగులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లను అశ్రయిస్తు వివిధ ప్రాంతాలకు వలస వెళుతున్నారనీ ఆర్థికంగా నష్టపోతున్నారని కావున వారి కోసం ప్రత్యేకంగా మన పారిశ్రామిక ప్రాంతంలో సెస్ నిధులతో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని వారికి వివరించడం జరిగిందని తెలిపారు.
గోదావరిఖని ప్రధాన కూడలిలో 2013 సంవత్సరంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ప్రారంభానికే నోచుకోవడం లేదంటే ఇంకో అడుగు ముందుకేసి ఐదు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి మరో అంతస్థు నిర్మాణం చేపట్టడం విడ్డూరంగా ఉందని, అది పూర్తిగా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.
గోదావరినదిలో మురుగునీరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. నురుగు పాయలు ఏర్పడి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆస్పత్రి ఖాళీ స్థలాన్ని కొంతమంది కబ్జాలు చేసే ప్రయత్నాలు జరగుతున్నాయని, ఖాళీ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించాలని వివరించడం జరిగిందన్నారు.
సమస్యలపై కమిషనర్ ఉదయ్ కుమార్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.