– జాతీయ కార్మిక సంఘాల పిలుపు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న ఒక్కరోజు దేశ వ్యాప్త జాతీయ సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జాతీయ కార్మిక సంఘాల నాయకులు వి.సీతారామయ్య, బి.జనక్‌ప్రసాద్, టి.రాజిరెడ్డి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
గురువారం గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ వారికి అమ్ముతున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు మరియు ప్రజలకు, దేశానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. బొగ్గు పరిశ్రమను రక్షించుకోవడానికి మరియు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం ఈ నెల 26న ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చామని వారు తెలిపారు. ఈ సమ్మెకు బీఎంఎస్, టిబీజికెఎస్ యూనియన్ల మద్దతు కోసం ఆహ్వానించడం జరిగిందని వారు తెలిపారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బొగ్గు పరిశ్రమల్లో కమర్షియల్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రైవేటు వారికి గనులను అప్పజెప్పడానికి నిర్ణయం తీసుకున్న విధానాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బొగ్గు సంస్థల్లో వాటాల అమ్మకాన్ని నిలిపివేయాలని, ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
సీఎంపిఎఫ్‌ను, ఇపిఎఫ్‌లో విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని, బొగ్గు పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలు కల్పించే స్కీంను రద్దు చేయరాదని, సీఎంపిడిఐ ని కోల్ ఇండియా నుండి వేరు చేసే విధానాన్ని నిలిపివేయాలని వారు అన్నారు. కోల్ ఇండియా మరియు సింగరేణి లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ సూచించిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వేతన ఒప్పందంలో పెరిగిన గ్రాట్యుటీ 20 లక్షల రూపాయలను 1-1-2017 నుండి రిటైర్డ్ అయిన కార్మికులకు వర్తింప చేయాలని, అదేవిధంగా మూసివేసిన గనులను తిరిగి తెరవాలని వారు అన్నారు. లేబర్ కోర్టు ఆమోదించిన అవార్డులను అమలు చేయాలని, కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి తీసుకోకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి కేసులను దాఖలు చేయడానికి వాటికి పరిమితం చేయాలని వారు అన్నారు. పై డిమాండ్ల సాధన కోసం ఈనెల 26న ఒక్కరోజు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని వారు కోరారు.ఈ సమ్మె నోటీసును యాజమాన్యానికి పంపించడం జరిగిందని వారు పేర్కొన్నారు.
ఇంకా ఈ సమావేశంలో జాతీయ సంఘాల నాయకులు వై గట్టయ్య, నరసింహారెడ్డి, మడ్డి ఎల్లా గౌడ్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు